బూర్గంపహాడ్ : తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ అని జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ అన్నారు. మండల కేంద్రమైన కృష్ణ సాగర్లో శుక్రవారం జాతీయ మాల మహానాడు బూర్గంపాడు యూత్ అధ్యక్షులు సల్వాది యశ్వంత్ ఆధ్వర్యంలో జాతీయ మాల మహానాడు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి శ్రీనివాసరావు, పినపాక నియోజకవర్గ అధ్యక్షులు పిల్లి రవివర్మ మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ మాలమహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవి వర్మ, పుట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి రమాబాయి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ స్వార్థపూరితమైన సమాజం కోసం తన పిల్లలను చంపుకొని మనమే తన పిల్లలు అనుకొని తన జీవితాన్ని దారపోసిన మహనీయురాలని అన్నారు. మన అమ్మ కేవలం నవమాసాలు మోసి పురిటినొప్పులు పడి మనకు జన్మనిస్తే, ఆ దంపతులిద్దరూ మన జీవితాల్లో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో పునర్జన్మను ప్రసాదించారని తెలిపారు.
ఈ భూమ్మీద నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది కేవలం నా భార్య రమాబాయికే అని అంబేద్కర్ కంటనీరు పెట్టుకున్నారనే విషయాన్ని వారు గుర్తుచేశారు. ఈ భారతదేశ తలరాతను మార్చిన ప్రపంచ మేధావి, నవ బుద్ధుడు బోధి సత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి త్యాగమూర్తి మాత రమాబాయి అంబేద్కర్ అని, ఆ తల్లికి ఈ దేశమంతా రుణపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి సుధాకర్, పొన్నాల నారాయణ, నిత్యశ్రీ, రామకృష్ణ, బద్రి తదితరులు పాల్గొన్నారు.