మామిళ్లగూడెం, జూన్ 11: ఖమ్మం నగరంలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ దుకాణం షట్టర్ల తాళాలను బుధవారం అర్ధరాత్రి దొంగలు పగులగొట్టి షాపులోకి చొరబడ్డారు. నూతనంగా వచ్చిన సెల్ఫోన్లన్నింటినీ చోరీ చేశారు. చోరీకి పాల్పడుతున్న క్రమంలో స్టోర్ మేనేజర్‌కు అలర్ట్ మెసేజ్ రావడంతో అందుబాటులో ఉన్న కొంతమంది ఉద్యోగులకు సమాచారం అందించి స్టోర్‌కు పంపించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే కారులో వచ్చిన నిందితులు దుకాణంలో స్టాక్ రూంలో భద్రపరిచిన విలువైన అధునాతన 167 సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.67 లక్షల వరకు ఉంటుంది.
వాటన్నింటినీ బ్యాగుల్లో వేసుకొని కారులో పారిపోయారు. ఇంతలో ఓ ఉద్యోగి స్టోర్ వద్దకు వచ్చి నిందితులు వచ్చిన కారుకు తన బైకును అడ్డుపెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ దొంగలు తమ కారును వేగంగా వెనక్కు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ చోరీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. స్టోర్‌కు నూతన స్టాక్ వచ్చిన మరుసటి రోజే చోరీ జరగడం పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, వర్కర్ల హస్తం; అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పన్నాగం వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్టోర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.
వైరా రోడ్డులోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న ఖమ్మం సీపీ సునీల్‌దత్ గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధ్వర్యంలో కీలక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చోరీ జరిగిన తీరును సీసీ కెమెరాల్లో పరిశీలించారు. దుకాణం సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించారు. సీపీ వెంట ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఖమ్మం వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తదితరులు ఉన్నారు.