ఖమ్మం రూరల్, ఏప్రిల్ 15 : తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవల మృతి చెందిన వనజీవి రామయ్య రెడ్డిపల్లిలోని నివాసానికి వెళ్లి ఆయన చిత్ర పటానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం-మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని కోరారు.
ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర వనజీవి రామయ్య మొక్కలు నాటిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్లీ అదే వరసలో మొక్కలు నాటి సంరక్షించి రామయ్యకు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను ప్రవేశ పెట్టాలని ఎంపీ కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Khammam Rural : మానుకోట రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర