సారపాక, జనవరి 21 : మణుగూరు మున్సిపాలిటీతోపాటు మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీలో టెలిఫోన్ ఎక్ఛేంజి నుంచి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వరకు సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీలు, రోడ్డు వెడల్పు పనులకు సంబంధించి రూ.2.60 కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పనులను ఆర్అండ్బీ అధికారులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి రేగా పరిశీలించారు. మణుగూరు మున్సిపాలిటీ, మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు నిధులను సమీకరించడం జరిగిందని, త్వరలోనే ఈ నిధులతో మణుగూరు రూపురేఖలను మార్చుతామన్నారు. మండలంలో మౌలిక సదుపాయాల కల్పనకు మరింత కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఏఈ రాంబాబు, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, ప్రజాప్రతినిధులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
‘అపర భగీరథుడు సీఎం కేసీఆర్’
తెలంగాణ అపర భగీరథుడు, అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు కలిసి ఈ నెల 29న అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంపుహౌస్ నుంచి మారెళ్లపాడు వరకు పనుల ప్రారంభానికి రేగాను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి పంపుహౌస్ నుంచి పనులకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 29న ఈ పనులను రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభిస్తామని, 16వేల ఆయకట్టు ఎకరాలకు నీరందించే మారెళ్లపాడు భూమిపూజ కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ తెల్లం వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.