‘దినదినగండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా ఉంది ‘104’ సంచార ఆరోగ్య వాహనాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో చేరిన ఉద్యోగుల దుస్థితి. ఫార్మసీ, ఏఎన్ఎం కోర్సులు పూర్తిచేసిన వారిని ‘104’ సంచార వాహనాల్లో వైద్యారోగ్య సేవలందించేందుకు 2008లో ఔట్ సోర్సింగ్ ద్వారా విధుల్లోకి తీసుకున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. 2010లో వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకుంది. అలా పదేళ్లపాటు పనిచేసిన తరువాత కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. సగం వేతనాల చెల్లింపులు, ఉద్యోగాల తొలగింపులు ఉధృతంగా జరుగుతున్న ఆ సమయంలో అప్పటి కేసీఆర్ సర్కారు వారిని చేరదీసింది. వివిధ ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసింది. కానీ.. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం.. అందరు ఉద్యోగుల మాదిరిగానే ‘104’ పూర్వ ఉద్యోగుల మీద కూడా కనికరాన్ని మరిచింది. గడిచిన ఆరు నెలలుగా వారి వేతనాల విడుదలనూ మరిచింది. దీంతో ఒకటీ రెండు నెలలపాటు అప్పులతో నెట్టుకొచ్చిన ఆ ఉద్యోగుల కుటుంబాలు.. ఇప్పుడు ఆకలితో అలమటించాల్సిన దయనీయ స్థితికి వచ్చాయి. మొత్తంగా వీరిని అప్పటి కాంగ్రెస్ పనిలోకి తీసుకుంటే.. ఇప్పటి కాంగ్రెస్ పస్తులుంచే స్థితికి తీసుకొచ్చింది.
-భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (నమస్తే తెలంగాణ)
వైద్యశాఖలో ఉద్యోగం చేయాలనే మక్కువ కలిగిన కొందరు.. 2008కి పూర్వమే ఉమ్మడి రాష్ట్రంలో ఫార్మసీ, మిడ్వైఫరీ కోర్సులు చేశారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వీరిని ఫార్మాసిస్టులుగా, ఏఎన్ఎంలుగా నియమించుకుంది. 108 వాహనాల విజయవంతం తరువాత సంచార వైద్య సేవలు అందించేందుకు 104 వాహనాలను తీసుకొచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ వాహనాల్లో వీరికి విధులు అప్పగించింది. అప్పుడు విధుల్లో చేరిన వారిలో ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 58 మంది ఉన్నారు. అయితే, ‘104’ వాహనాల్లో సంచార వైద్య సేవలకోసమంటూ ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా వీరిని నియమించుకున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. 2010 తరువాత వైద్యారోగ్యశాఖలోకి కూడా వీరిని తీసుకొని అక్కడ కూడా వీరి సేవలను వినియోగించుకుంది.
తరువాత సుమారు పదేళ్లపాటు వారు సక్రమంగానే విధులు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తెలంగాణలోనూ విజృంభించింది. ఆ సమయంలో ప్రభుత్వం కూడా ప్రభుత్వరంగ ఉద్యోగులకు నెలకు సగం వేతనమే చెల్లిస్తూ వచ్చింది. ప్రైవేటు రంగంలో తొలగింపులూ భారీగానే జరిగాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపులు కూడా గణనీయంగా జరుగుతున్న పరిస్థితులవి. కానీ.. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అందరు ఉద్యోగులతోపాటు ఈ ‘104’ పూర్వ ఉద్యోగుల విషయంలోనూ ఎంతో సానుభూతితో వ్యవహరించింది. వీరి తొలగింపుల జోలికి వెళ్లకుండా వీరిని వివిధ ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసింది. అక్కడ వారి సేవలను వినియోగించుకుంది. వేతనాలనూ సమయానుకూలంగా అందించింది.
ఈ క్రమంలో సరిగ్గా ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒకప్పుడు తాము పనిలోకి తీసుకున్న ‘104’ వాహనాల పూర్వ ఉద్యోగుల విషయంలో కనీస మానవీయతనూ ప్రదర్శించలేదు. కొన్ని నెలలపాటు పరవాలేదనిపించినా.. గడిచిన ఆరు నెలలుగా కనీసం వేతనాలు కూడా విడుదల చేయడం లేదు. ఔట్ సోర్సింగ్ విధానంలో చాలీచాలని వేతనాలతో కుటుంబాలను వెళ్లదీసుకునే ఈ ఉద్యోగులు.. ఒకటీ రెండు నెలలపాటు అప్పోసప్పో చేసి పూట గడుపుకున్నారు. కానీ.. నెలల తరబడి చెల్లింపులు చేయకపోవడంతో ఆయా దుకాణాల యజమానులు కూడా ఉద్దెరను కొనసాగించకపోవడంతో వీరి కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేని కారణంగా గడిచిన ఆరు నెలలుగా ఆయా కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ముంచుకొచ్చింది.
కరోనాకు ముందు వరకూ ఒకే చోట పనిచేసిన వీరంతా.. కరోనా తరువాత సర్దుబాట్లలో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులను బట్టి, వారి ఉపాధిని కాపాడాలన్న అప్పటి ప్రభుత్వ సంకల్పాన్ని బట్టి ఆయా ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీల్లో అటెండర్లుగా, సెక్యూరిటీ గార్డుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా, ఫార్మాసిస్టులుగా, ఏఎన్ఎంలుగా, డ్రైవర్లుగా సర్దుబాటు అయ్యారు. భద్రాద్రి జిల్లాలో 58 మందిగా ఉన్న వీరు.. గత ఆరు నెలలుగా తమకు వేతనాలు అందని విషయాన్ని కలెక్టర్ సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకూ విన్నవించుకున్నారు. కానీ.. సర్కారు విడుదల చేయకుండా నాన్చుతుండడంతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకైతే వేతనం ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా వారికి వేతనాలు అందుతాయి. ఒకవేళ ఒకటీ రెండు నెలలు రాకున్నా వారికి సర్దుబాటు చేసుకోగలరు. కానీ.. మాలాగ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చిరుద్యోగులుగా చేస్తున్న మాకు ఆరు నెలలుగా వేతనం రాకుండా ఎలా పనిచేయాలి? వేతనాలు లేకుండా కుటుంబాలను పోషించుకోవడం ఎంత కష్టమో మా ఇళ్లకు వచ్చి చూస్తే తెలుస్తుంది.
-డీ.రవికుమార్, ఫార్మాసిస్టు, సులానగర్ పీహెచ్సీ
ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక నరకం అనుభవిస్తున్నాం. అప్పుల సమయం దాటిపోయి పస్తులుండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బడ్జెట్ వచ్చినా కూడా ప్రభుత్వం మా వేతనాలను విడుదల చేయడం లేదు. మరి మా కుటుంబాలను ఎలా బతికించుకోవాలి. నెల వచ్చేసరికి పాలకు, సరుకులకు, కరెంటు బిల్లులకు, కుటుంబ పోషణకు చెల్లింపులు చేసుకోవాలి కదా?
-ప్రసాద్, ఫార్మాసిస్టు, ఎర్రగుంట పీహెచ్సీ, అన్నపురెడ్డిపల్లి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బడ్డెట్ లేటుగా వస్తుంటుంది. వచ్చినప్పుడల్లా ఆపకుండా వెంటనే బిల్లు చేస్తాం. గడిచిన ఆరు నెలలుగా వీరికి వేతనాలు రాని మాట వాస్తవమే. ఇటీవలే అన్నపురెడ్డిపల్లిలో ఆయా ఉద్యోగులు నన్ను కలిశారు. వేతనాలు రాని విషయం గురించి చెప్పారు. ఈ క్రమంలో మేం కూడా ఇటీవలే బిల్లులు చేశాం. రేపుమాపో జీతాలు వస్తాయి. ఏజెన్సీ ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
-భాస్కర్నాయక్, డీఎంహెచ్వో, భద్రాద్రి