మణుగూరు టౌన్, జూన్ 5 : తాజా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోకపోయినంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు కుంగిపోవాల్సిన అవసరం లేదని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నంత మాత్రాన ధైర్యం కోల్పోవాల్సిన పని ఏమీ లేదని అన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ సోషల్మీడియా వేదికగా బుధవారం ఆయన ఒక సందేశం పోస్ట్ చేశారు. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుందామని, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకుందామని అన్నారు. ప్రజల పక్షాన పోరాడుదామని, ప్రజా గొంతుకగా నిలుద్దామని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, ఓటమిలోనూ గెలిచేతత్వాన్ని అలవర్చుకోవాలని ఉద్బోధించారు.