భద్రాద్రి-కొత్తగూడెం, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో పని చేస్తున్న కార్మిక వర్గానికి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి, కార్మికులకు ఎనిమిది గంటలు పని, సమ్మె హక్కు లేకుండా చేయడం సరి కాదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం స్పష్టం చేశారు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన టీయూసీఐ జిల్లా మహాసభ కొత్తగూడెం ఊర్దూ భవన్లో జరిగింది. ఈ మహాసభలో సూర్యం మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాల్సి ఉందని అన్నారు. నామమాత్ర వేతనాలతో కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. సుప్రీం కోర్టు ఉచిత పథకాలివ్వొద్దనడం సరి కాదన్నారు. కనీస వేతనం ఇవ్వకుండా రైతు కూలీ, కార్మికులకు చట్టాలు చేయకుండా వేతనాలు ఖరారు చేయకుండా న్యాయమూర్తులు ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు. ప్రస్తుతం కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న వారి మీద సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండడం సరికాదన్నారు. సుమోటోగా కేసు తీసుకుని బ్యాంకులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రారంభోసన్యాసం చేస్తూ దేశంలో, రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల పేరుతో కేంద్ర స్కీములో పనిచేస్తున్న ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం తదితర రంగాల కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు, రిటైర్డ్ బెనిఫిట్ కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆ ప్రాధాన్యం లేదన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మహాసభకు ఆర్ మధుసూధన్ అధ్యక్షత వహించారు. రైల్వే స్టేషన్ నుండి ఉర్దూఘర్ వరకు కార్మిక, కళాకారుల ప్రదర్శన, చాలా ఉత్సాహంగా జరిగింది. యూనియన్ జెండాను ఆర్ మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు.
సీపీఐఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద బిక్షం మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజలు కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. ఈ మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు, గడిపల్లి కృష్ణా ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేయటం సరి కాదన్నారు. సంఘం పెట్టుకునే హక్కు బ్రిటిష్ ప్రభుత్వంలో కొట్లాడి సాధించుకున్నారని ఇప్పుడు కాలరాయడం సరైనది కాదని వారన్నారు. మహాసభలో అరుణోదయ కళాకారుల ఆటపాట మహాసభకు వచ్చిన కార్మికులను అలరింపజేశాయన్నారు.