భద్రాచలం, అక్టోబర్ 17: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం లక్ష్మీతాయారమ్మ గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు.
అష్టోత్తర శత నామార్చన, సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు. చిత్రకూట మండపంలో అయోధ్యా కాండ పారాయణం చేశారు. సాయంత్రం స్వామివారికి దర్బార్ సేవ, నివేదన, మహా మంత్రపుష్పం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు. అనంతరం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ చేపట్టారు. కాగా బుధవారం అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.