కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 10: సింగరేణి సంస్థలో కొత్త మైన్లు రాకపోతే భవిష్యత్తు ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసి సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తులు టెండర్ల ద్వారా దక్కించుకున్న సత్తుపల్లి, ఇల్లెందు బ్లాకులను సింగరేణికే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. తాడిచర్ల 2 బ్లాక్‌తోపాటు భూపాలపల్లి వెంకటాపూర్ మైన్‌ను కూడా అప్పజెప్పాలని అన్నారు. లేకుంటే సింగరేణికి భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి ఉన్నతాధికారులు ప్రభుత్వం వద్ద తమకు గొప్ప పేరు తెచ్చుకునేందుకు లాభాల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని, సింగరేణిలో నెలకొన్న సమస్యలపై త్వరలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక చైతన్యయాత్ర నిర్వహిస్తామన్నారు. డిపెండెంట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వీరస్వామి, వెంకట్, కోటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.