కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 7: కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) పరితోష్ పంకజ్‌కు సంగారెడ్డి ఎస్పీగా ఉద్యోగోన్నతి లభించింది. పరితోష్ స్వస్థలం.. బీహార్ రాష్ట్రంలోని బోజ్పూర్ జిల్లా ఆరా పట్టణం. ఆయన తండ్రి నరేంద్ర సత్యనారాయణ సింగ్.. రిటైర్డ్ ప్రొఫెసర్. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆయన 2010 నుంచి 2015 వరకు ప్రైవేట్ ఉద్యోగిగా పంకజ్ పనిచేశారు.
2015లో మర్చంట్ నేవీలో ఉద్యోగం పొందారు. అందులో సెకండ్ నేవిగేటింగ్ కమాండర్‌గా పనిచేశారు. 2020లో సివిల్స్‌లో విజయం సాధించి, ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండర్‌గా మొదటి పోస్టింగ్ అందుకున్నారు. 2023లో బదిలీపై భద్రాచలం ఏఎస్పీగా వెళ్లారు. 2024 జూలైలో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. కొత్తగూడెం ఓఎస్డీగా, ఆ తర్వాత భద్రాచలం ఏఎస్పీగా పనిచేశారు. తాజాగా.. ఉద్యోగోన్నతితో సంగారెడ్డి ఎస్పీగా బదిలీ అయ్యారు.