ఖమ్మం, జనవరి 16 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు జనం వెల్లువలా తరలిరావాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. ఈ సభను పార్టీ అధిష్టానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని, చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయేలా సభా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సోమవారం ఆయన ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నమస్తే: ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరిగే సభకు పార్టీ ఏ రకమైన ప్రచారం నిర్వహిస్తున్నది?
తాతా మధు: బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే కీలకఘట్టంగా నిలిచిపోయే భారీ బహిరంగ సభకు జిల్లా పార్టీ పెద్దఎత్తున ప్రచారం నిర్వహిసున్నది. బహిరంగ సభా ప్రాధాన్యతను గ్రామగ్రామాన తిరిగి చెప్పే బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకున్నారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు వచ్చేలా గ్రామాలు, డివిజన్ల వారీగా ఇన్చార్జీలను నియమించి వారు సభకు వచ్చేలా తోడ్పాటు అందిస్తున్నాము.
నమస్తే : సభ ప్రాధాన్యత ఏమిటి?
తాతా మధు :బీఆర్ఎస్ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఈ సభ ఉండనున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి, ప్రజాసంక్షేమం పెద్దఎత్తున జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధిని చూసి తెలంగాణ పాలన అవసరమని దేశ ప్రజలు కోరుతున్నారు. జాతీయస్థాయిలో ఈ బహిరంగ సభ దిశానిర్దేశం చేయనున్నది.
నమస్తే: సభా ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయి?
తాతా మధు: బహిరంగ సభకు పార్టీ అంచనాలకు మించి అనూహ్య స్పందన లభిస్తోంది. సభకు సీనియర్ సిటిజన్లు సైతం మేము వస్తామంటూ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారందరికీ ఏ లోటూ కలుగకుండా చూడడం మా బాధ్యత. ఇందుకు సంబంధించి అవసరమైన వాహనాలను పార్టీ నాయకులతో చర్చించి సమకూర్చుకుంటున్నాం. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ సౌకర్యం కల్పించాం. 448 ఎకరాల్లో 20చోట్ల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. ఇంటి నుంచి బయల్దేరిన కార్యకర్త మళ్లీ ఇంటికి చేరేలా పార్టీ నాయకులు బాధ్యత తీసుకోనున్నారు.
నమస్తే: సభ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది.
తాతా మధు: బహిరంగ సభ వీ వెంకటాయపాలెం రెవెన్యూ పరిధిలోని నూతన కలెక్టరేట్ సమీపంలో వంద ఎకరాల స్థలంలో జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా తదితరులు కీలక ప్రసంగం చేయనున్నారు. నాలుగున్నర గంటల వరకు సభ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
నమస్తే: సభా స్థలికి ముఖ్యఅతిథులు ఎలా చేరుకుంటారు?
తాతా మధు: 18వ తేదీన హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ముఖ్యఅతిథులు యాదాద్రిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి రెండు ప్రత్యేక హెలికాఫ్టర్లలో నేరుగా ఖమ్మంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీఫ్యాడ్లో దిగి కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకొని సభకు వస్తారు.