రఘునాథపాలెం, నవంబర్ 30: అగ్రరాజ్యం వెళ్తున్నాడంటే ఆ కుటుంబీకులు సంబురపడ్డారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తానంటే కష్టమైనా సరేనని పంపించారు. అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నానంటే మురిసిపోయారు. కానీ, ఆ తల్లిదండ్రుల సంతోషం ఎక్కువ కాలం నిలువలేకదు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన కొడుకు.. దుండగుల కాల్పుల్లో దుర్మరణం చెందాడన్న దుర్వార్త ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలోకి ముంచింది. అంతకుముందు రోజు రాత్రే వీడియో కాల్ మాట్లాడిన కొడుకు.. తెల్లారే సరికే కానరాని లోకాలకు చేరాడనే ఫోన్‌కాల్ విన్న ఆ తల్లిదండ్రులు.. దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘భగవంతుడా?’ అంటూ గుండెలవిసేలా రోదించారు.
ఖమ్మం రామన్నపేట ప్రాంతానికి చెందిన నూకారపు కోటేశ్వరరావు – వాణి దంపతులకు కుమార్తె, కుమారుడు సాయితేజ (22) ఉన్నారు. సాయితేజ ఎంఎస్ చదివేందుకని ఈ ఏడాది జూన్ 15న అమెరికా వెళ్లాడు. అక్కడి చికాగో రాష్ట్రం కాంకోడియా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం అక్కడే ఓ షాపింగ్‌మాల్‌లో కౌంటర్ మేనేజర్‌గా పార్ట్‌టైమ్ జాబ్‌లో చేరాడు.
శుక్రవారం పార్ట్ టైమ్‌జాబ్ చేస్తున్న క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్‌మాల్‌లోకి చొరబడి డబ్బులివ్వాలని సాయితేజను డిమాండ్ చేశారు. దీంతో భయపడిన సాయితేజ.. కౌంటర్ నుంచి డబ్బులు తీసి వారికి ఇచ్చాడు. అయినప్పటికీ ఆ దుండగులు సాయితేజపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉంటున్న సాయితేజ బంధువులు ఈ విషయాన్ని తెలుసుకొని ఖమ్మంలోని అతడి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సాయితేజ మృతితో కుమారుడిపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి.
సాయితేజ హత్యకు గురి కావడంతో ఖమ్మంలోని అతడి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. స్వస్థలమైన రామన్నపేటకు పెద్దఎత్తున బంధువులు తరలివచ్చి సాయితేజ తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. కాగా, సాయితేజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ తాతా మధు పరామర్శించారు. సాయితేజ మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని తానా ప్రతినిధులను ఆయన కోరారు. అలాగే, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా సాయితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.