కొలువు సాధించాలంటే ఏళ్లకు ఏళ్లు చదువులు చదవాల్సిన అవసరం లేదు. పేరు పక్కన డిగ్రీలు అవసరం లేదు. ఐటీఐల్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ) కోర్సు పూర్తయితే చాలు.. దేశంలో ఎక్కడకుపోయినా వెంటనే ఉపాధి పొందేందుకు ఉద్దేశించినదే ఏటీసీ కోర్సు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఉజ్వల భవిష్యత్ కల్పించే బాధ్యత మాది అంటూ గొప్పలకు పోయిన పాలకులు ఆచరణలో మాత్రం అభాసుపాలవుతున్నారు. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని మూడు ఐటీఐలను మోడల్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్‌గా మారుస్తున్నట్లు ఏప్రిల్ 2024లో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఇంకా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ప్రవేశాలకు అనుమతులిచ్చింది.
-ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 24
రాష్ట్రవ్యాప్తంగా 65 ప్రభుత్వ ఐటీఐ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) కళాశాలలున్నాయి. 65 కళాశాలలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్(ఏటీసీ)గా మార్చనుండగా, తొలిదశలో రాష్ట్రంలో మూడు ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా మార్చేందుకు ఎంపిక చేసింది. వాటిలో హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ, నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐ, ఖమ్మం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలున్నాయి. వీటిలో ఈ విద్యాసంవత్సరం నుంచి 6 కొత్త కోర్సులను నిర్వహించేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్(ఎన్సీవీటీ) అనుమతులు ఇచ్చింది. వీటిల్లో సంవత్సరం కోర్సులు.. 1.మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ 2.ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ 3.ఆర్టిసాన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి. రెండేళ్ల కోర్సులు 1.బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వైరిఫైల్ 2.అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నిషియన్ 3.మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నాయి.
మోడల్ కళాశాలలుగా ఎంపిక చేసిన కళాశాలలో ఖమ్మం ఐటీఐ ఒకటి. అడ్మిషన్స్ బాగా ఉన్నాయని, అప్రెంటిషిప్ల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటారనే కారణాలతో ఖమ్మం ఐటీఐ కళాశాలని ఎంపిక చేశారు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్‌గా ఏప్రిల్‌లో ఎంపిక చేస్తే భవన నిర్మాణానికి జూన్‌లో టెండర్స్ పిలిచారు. అప్పటికే రెండునెలలపాటు కాలయాపన చేశారు. సెప్టెంబర్ వచ్చినా ఇంకా ప్రారంభ దశలోనే ఉండి అడ్వాన్స్డ్ సెంటర్ నిర్వహణకు అవస్థలు స్వాగతం పలకనున్నాయి. టీజీఐఐసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేయనుండగా స్లాబ్ పద్ధతికి బదులుగా పీఈపీ విధానంలో 13వేల ఎస్ఎఫ్టీ నిర్మించేందుకు రూపకల్పన చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4.77 కోట్లు కేటాయించింది. ఈ 13 వేల ఎస్ఎఫ్టీలో 6 నూతన కోర్సుల కోసం ల్యాబ్‌లతో కూడిన తరగతి గదులను నిర్మించాల్సి ఉంది.
నూతన కోర్సుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం టీటీఎల్ (టాటా టెక్నాలజీస్ లిమిటెడ్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ మూడు సంవత్సరాలపాటు నిపుణులైన సిబ్బందితో విద్యార్థులకు శిక్షణ కల్పించాలి. విద్యార్థులతోపాటు అన్ని ఐటీఐ కళాశాలల్లోని అధ్యాపకులకు శిక్షణ కల్పించాలి. వీటితోపాటు రూ.10 కోట్ల విలువైన టూల్స్, పరికరాలు జిల్లాలో ప్రభుత్వ ఐటీఐకి చేర్చారు. వీటిని ఎక్కడ ఉంచాలో తెలియక ప్రస్తుతం ఉన్న ఫిట్టర్, ఇతర ల్యాబ్‌ల్లో భద్రపరిచారు. ఇతర కోర్సులకు సంబంధించిన ల్యాబ్‌ల్లో వీటిని ఉంచడంతో ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేసేందుకు వీలులేక ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు నూతన పరికరాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నూతన పరికరాలను అందుకు అనువుగా ఉన్న బల్లలపై బిగించాల్సి ఉండగా అందుకు అనుగుణంగా భవన నిర్మాణం కాకపోవడంతో తాత్కాలికంగా ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియని పరిస్థితి.
ఖమ్మంలోని ఐటీఐలో ఇప్పటి ఎలక్ట్రిషియన్, సోలార్ టెక్నిషియన్, కూపా, డ్రస్ మేకింగ్, వెల్డర్, స్మార్ట్ అగ్రికల్చర్, డీఎం సివిల్ కోర్సులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటివరకు నాలుగు ఫేజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించగా 192 సీట్లకు 143 మంది విద్యార్థులు ప్రవేశాలు పూర్తయ్యాయి. అయిదో ఫేజులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు నూతన 6 కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రిన్సిపాల్ అడ్మిషన్లకు అవసరమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన కోర్సుల్లో తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. 6 కోర్సులను బోధించేందుకు ఒక్కో కోర్సుకు టీటీఎల్ సంస్థ ఇద్దరిని కేటాయించాల్సి ఉండగా ఇప్పటివరకు ఖమ్మం ఐటీఐకి ఇద్దరిని మాత్రమే కేటాయించింది.
నూతన కోర్సుల నిర్వహణకు అవసరమైన భవనం సిద్ధంకాకపోయినా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. కళాశాలలో ఉపాధి కల్పనాశాఖ ఆధీనంలో ఉన్న రెండు గదులను వినియోగించుకుంటాం.. నూతన ప్రయోగాల సామగ్రిని ఇతర ల్యాబ్‌లో భద్రపరిచాం. అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియను నిర్వహిస్తున్నాం.
-శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, ఖమ్మం ఐటీఐ