కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 16: పట్టణాలు ఎంత మేరకు పరిశుభ్రంగా ఉన్నాయి.. అందులో నివసించే ప్రజలకు మౌలిక వసతులు ఏమేరకు అందుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రజలతో ఓటింగ్ నిర్వహించి ర్యాంకులు, అవార్డులను ప్రకటిస్తున్నది. 2016 నుంచి మున్సిపాలిటీల్లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పేరిట ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. జనాభా ఆధారంగా 50 శాతం తగ్గకుండా ఓటు వేసేలా వారికి అవగాహన కల్పిస్తున్నది. ప్రతి ఏడాది ఏప్రిల్‌లో యాప్, ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తున్నది. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూ డెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు నాలుగు మున్సిపాలిటీల్లో ఈ అంశంపై అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అవార్డు, మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తున్నారు.
మున్సిపాలిటీల్లో వార్డులు పరిశుభ్రంగా ఉన్నాయా?, పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు ఇంటి ముందుకొచ్చి చెత్తను తీసుకెళ్తున్నారా?, తడి, పొడి చెత్తను వేరు చేసి డీఆర్సీసీ సెంటర్లకు తరలిస్తున్నారా? మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయా?, వాటిని ఉపయోగిస్తున్నారా?, మున్సిపాలిటీ పూర్తిగా ఓడీఎఫ్‌గా ప్రకటించారా? స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మీ నగరం పాల్గొంటున్న విషయం తెలుసా?, గతేడాది మీ మున్సిపాలిటీకి వచ్చిన ర్యాంకు తెలుసా?, పరిసరాల స్వచ్ఛత కోసం యాప్‌లో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారా?, తదితర అంశాలపై వివరాలను సేకరిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అడిగిన ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన సమాధానాల ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తారు. యాప్, ఆన్లైన్ ద్వారా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. పరిసరాలు, పరిశుభ్రత విషయంలో మనకు నచ్చిన విధంగా మార్కులు వేయవచ్చు. భద్రాద్రి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు లక్ష లోపు జనాభా కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా లక్షలోపు ఉన్న జనాభాలో తొలి 20 స్థానాల్లో పాల్వంచ మున్సిపాలిటీ చోటు దక్కించుకున్నది. ఇప్పటికే కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న జనాభా ఆధారంగా 87,370కి గాను 43,685 మందితో ఓటు వేయించాల్సి ఉంది. ఇప్పటివరకు 8,214 మంది మాత్రమే ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక పాల్వంచ మున్సిపాలిటీలో ఉన్న 96,403 జనాభాలో 48,202లో ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. 15,230 మంది పాల్గొన్నారు. ఇల్లెందులో 40,294 జనాభాలో 20,147 ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా 12,025 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మణుగూరు మున్సిపాలిటీలో 35,375 జనాభా ఉండగా.. 17,688మంది ఓటింగ్‌లో పాల్గొనాలి. కానీ ఇప్పటివరకు 3,200 మంది ఓటు వేశారు.
పట్టణాల్లో విస్తృత ప్రచారం
పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో పాల్గొనాలని మున్సి పల్ అధికారులు విస్రృతంగా ప్రచారం చేస్తున్నారు. మన మున్సిపాలిటీ ఏ విధంగా ఉన్నదనే అంశంపై ప్రజలే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ) ద్వారా ప్రజలను ఓటింగ్‌లో పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, పా ల్వంచ, ఇల్లెందు, మణుగూరు నాలుగు మున్సిపాలిటీల్లో ఈ అంశంపై మున్సిపాలిటీ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నా రు. గతేడాది దేశవ్యాప్తంగా 4,242 మున్సిపాలిటీలు, నగర సంస్థలు పాల్గొన్నాయి. జాతీయస్థాయి, జోనల్‌స్థాయి, రాష్ట్రస్థాయిలో 10లక్షల జనాభాపైన, 10 లక్ష ల జనాభాలోపు, లక్షలోపు జనాభా కేటగిరీల వారీగా ర్యాంకులను ప్రకటిస్తారు. 2020 గతేడాది రాష్ట్రస్థాయిలో మణుగూరు 85వ ర్యాంకు, కొత్తగూడెం 102, పాల్వంచ 106, ఇల్లెందు 129వ ర్యాంకు సాధించింది. 2021లో మున్సిపాలిటీలు కొంత మెరుగైన స్థానాన్ని సంపాదించాయి. ఈ ఏడాది నిర్వహించే కార్యక్రమంలో అవార్డు, మెరుగైన ర్యాం కును సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
మెరుగైన ర్యాంకు సాధిస్తాం..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ ఏడాది మెరుగైన ర్యాంకు సాధిస్తాం. ఆ దిశగా కృషి చేస్తున్నాం. మెప్మా రిసోర్స్పర్సన్ల ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా సూచనలు చేశాం. ఈ నెల 30వ తేదీ వరకు యాప్, ఆన్లైన్ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొని వారి అభిప్రాయాలు తెలపాలి.
– తోటమళ్ల నవీన్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం