సుజాతనగర్, అక్టోబర్ 20: రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఇంటిని పోషించే వారి మరణం ఆ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. మరణించకపోయినా శాశ్వత వైకల్యం ఏర్పడినా కుటుంబ సభ్యులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకోవాల్సిందే. ఇలాంటి సమయాల్లో ఆ కుటుంబాన్ని ఆపద నుంచి గట్టేక్కెంచేవి బీమా పాలసీలే. ఇదే కోవలో తపాలాశాఖ టాటా ఏఐజీతో కలిసి సామూహిక ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. పాలసీదారుడు వార్షిక ప్రీమియం రూ.399 చెల్లిస్తే చాలు రూ.10 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. బీమా కోసం ప్రజలు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
చేకూరే ప్రయోజనాలు ఇవీ..
సామూహిక ప్రమాద బీమా పథకానికి 18- 65 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అర్హులు. పాలసీదారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, పక్షవాతం బారిన పడినా తపాలాశాఖ ఆ కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లిస్తుంది. పాలసీ పొందిన వ్యక్తి ప్రమాదానికి గురై వైద్యం కోసం దవాఖానలో చేరితో ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ కింద రూ.60 వేలు లేదా క్లెయిమ్.. ఏది తక్కువ అయితే అది బాధిత కుటుంబానికి అందుతుంది. దవాఖానలో రోజువారీ ఖర్చులకు పది రోజుల వరకు రోజుకు రూ.వెయ్యి చొప్పున అందుతుంది. విద్యా ప్రయోజనానికి గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు రుసుములో రూ.10 శాతం లేదా రూ.లక్ష వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనాలకు రూ.25 వేలు, పాలసీదారుడు మృతిచెందితే అంత్యక్రియలకు రూ.5 వేలు అందుతుంది. ఈ పథకంలో మరో ఐచ్ఛికం కింద ఏడాదికి రూ.399 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది.
వీరు అనర్హులు..
సాహస క్రీడల్లో పాల్గొనేవారు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్‌శాఖలో పనిచేసే వారు, డ్రైవింగ్ వృత్తితో సంబంధం ఉన్నవారు పథకానికి అనర్హులు. పాలసీదారుడు ఆత్మహత్య చేసుకున్నా, దోమకాటు వల్ల వచ్చే వ్యాధులతో మృతిచెందినా, డ్రగ్, ఆల్కహాల్ ప్రభావంతో మరణించినా, నేరం, అల్లర్లు, పేలుళ్లలో నేపథ్యంలో చనిపోయినా, మహిళలైతే ప్రసవ సమయంలో చనిపోయినా పథకం వర్తించదు.
సద్వినియోగం చేసుకోవాలి..
బీమా పథకం మంచి పథకం. ప్రజలకు తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు ఒనగూరే విధంగా తపాలాశాఖ పథకాన్ని రూపొందించింది. దీనిలో చేరాలనుకునే వారు సమీపంలోని తపాలాశాఖ కార్యాలయంలో సంప్రదించాలి. ప్రతిఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పథకం ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ప్రయోజనకరం.
– రంజిత్ కుమార్ చౌదరి, అసిస్టెంట్ సూపరింటెండెంట్, కొత్తగూడెం పోస్టాఫీస్