కారేపల్లి, అక్టోబర్ 19 : పోడుభూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని పేరుపల్లి రెవెన్యూ జమాండ్లపల్లిలో జరుగుతున్న పోడు భూముల సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. పోడు చేస్తున్న భూమి కాకుండా కొత్తగా అటవీ భూమి ఆక్రమణకు గురికావద్దని సిబ్బందికి తెలిపారు. కొత్తగా ఎవరైనా పోడు భూములు సాగు చేస్తే సర్పంచ్‌లే బాధ్యత వహించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ స్పిరిట్‌ను అర్థం చేసుకుంటూ రెవెన్యూ, ఫారెస్ట్, వ్యవసాయశాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్‌శాఖల అధికారులు పోడు భూములపై హక్కుల కల్పనకు ప్రాథమిక రిపోర్ట్ సిద్ధం చేయాలన్నారు. పోలంపల్లి గ్రామ పంచాయతీ మోకాళ్లరామయ్య గుంపులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు- మన బడిలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. వేగంగా నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వంటకాల రుచిపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఎఫ్‌వో సిద్దార్థ విక్రమ్‌సింగ్, ఎఫ్‌డీవో ప్రకాశ్రాన్స్, డీఈవో యాదయ్య, ఎంపీపీ మాలోత్ శకుంతల, మండల ప్రత్యేకాధికారి అప్పారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో జయరాజు, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎఫ్ఆర్వో రాధిక, సర్పంచ్‌లు మాలోత్ కిశోర్, అజ్మీరా నాగేశ్వరరావు, ఎంపీవో రాజారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.