రఘునాథపాలెం, అక్టోబర్ 16 : పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి వైరా రోడ్డులోని వీ వెంకటాయపాలెం వద్ద నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ పనులను పర్యవేక్షించారు. విద్యుత్ సమస్యలకు అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని, జనరేటర్తోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌కు సంబంధించిన అన్ని బ్లాకులను క్షణ్ణంగా పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఆ దిశగా అధికారులు అన్ని హంగులతో భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ లక్ష్మణ్, ఈఈ శ్యాం ప్రసాద్, విద్యుత్ ఎస్ఈ, ఏఈ విశ్వనాథ్, ఏడీఈ రమేశ్ పాల్గొన్నారు.
శ్రీశ్రీ కూడలి వద్ద పనుల పరిశీలన
ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ కూడలి వద్ద చేపడుతున్న ఆధునీకరణ పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. భారీ వాహనాలు కూడా సులభంగా తిరిగేలా కూడలి ఏర్పాటు ఉండాలన్నారు. భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు.