సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 8 : ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రతో సత్తుపల్లి పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే సండ్ర విలేకరులతో మాట్లాడారు. సత్తుపల్లి పట్టణంలోని జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే బహిరంగ సభకు పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి ప్రాంతాల ప్రజలను పెద్దఎత్తున సమీకరించి బహిరంగ సభకు తరలించాలని సూచించారు. 17న సాయంత్రం 3 గంటలకు తల్లాడ, 4 గంటలకు కల్లూరు పట్టణాల్లో రాజ్యసభ సభ్యులతో కలిసి రోడ్‌షో నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు సత్తుపల్లి డిగ్రీ కళాశాల ఆవరణలో భారీ బహిరంగసభ నిర్వహించడంతోపాటు నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్న వద్దిరాజు, బండిని సన్మానించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని వెంగళరావునగర్ నుంచి ప్రధాన రహదారి మీదుగా కాకర్లపల్లి రోడ్డు వరకు, తిరిగి జేవీఆర్ కళాశాల వరకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి 17న ఏర్పాటు చేయాల్సిన సభావేదిక ప్రదేశాన్ని సండ్ర పరిశీలించి సభావేదిక ఏర్పాటుకు బాధ్యులను నియమించారు. సభ ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 13న వేంసూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లిలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సభా వేదిక స్థలాన్ని పరిశీలించిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, హెటిరోడ్రగ్స్ ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, రఫీ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు మందపాటి రవీందర్‌రెడ్డి, గాదె సత్యం, చల్లగుళ్ల కృష్ణయ్య, మందపాటి రవీందర్‌రెడ్డి, తడికమళ్ల ప్రకాశ్‌రావు, మల్లూరు అంకమరాజు తదితరులు ఉన్నారు.