జూలూరుపాడు, అక్టోబర్ 8: జూలూరుపాడు, వెంగన్నపాలెంలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి.. గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లపై సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆదమరిచి ఇంటి ముందు తలుపులు వేయకుండా ఉంటే ఇళ్లలోని కూరగాయలు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. ఇళ్ల ఆవరణలోని కూరగాయలు, పండ్ల మొక్కలను పెకిలిస్తున్నాయి. రహదారిపైకి వచ్చి అటుగా వెళ్తున్న వారిపై దాడికి పాల్పడుతున్నాయి. వీధుల్లో బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తినుబండారాల దుకాణాల్లోకి ప్రవేశించి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. వానరాలను చూసి చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పంట పొలాల్లో పత్తికాయలు, పిందెలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శనివారం వెంగన్నపాలేనికి చెందిన నీలాల కీసందరావుపై కోతులు దాడి చేశాయి. ఘటనలో కీసందరావు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ పలువురిపై దాడి చేశాయని, కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని మండలవాసులు కోరుతున్నారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.