మధిర టౌన్, అక్టోబర్ 7: కొందరు ఉద్యోగులు తాము చేస్తున్న వృత్తికే పరిమితమవుతారు. ఇంకొందరు తమ అభిరుచులకు తగిన విధంగా జీవితాన్ని మలుచుకుంటారు. మరికొందరు ఆ రెండూ చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజలకు చేతనైన సాయం చేస్తుంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య పర్యవేక్షకుడు లంకా కొండయ్య. ఆరోగ్య పర్యవేక్షకుడిగా నిబద్ధతతో పనిచేస్తూ ఉత్తమ ఉద్యోగిగా అనేకసార్లు అవార్డులు అందుకున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఖాళీ సమయం, సెలవుల్లో సామాజిక సేవల్లో పాల్గొంటారు. మధిర మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాల్లో హెచ్ఐవీ, మలేరియా, డెంగీ, క్షయ, కుష్ఠు, సీజనల్ వ్యాధులు, కరోనా వంటి వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. హెల్త్క్యాంపుల్లో వ్యాధుల నివారణపై కళా ప్రదర్శనలిస్తారు.
హెచ్ఐవీ నివారణపై 10 వేల ప్రదర్శనలు..
లంకా కొండయ్య గడిచిన 25 ఏళ్లలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణపై ఇప్పటివరకు 10 వేల ప్రదర్శనలిచ్చారు. మండలం, జిల్లా, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. దశాబ్దం నుంచి నెలనెలా వివిధ రకాల వ్యాధి బాధితులు, వితంతువులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. తాను సాయం చేయడమే కాక మరికొందరిని భాగస్వాములు చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధం, గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. ముఖ్యంగా క్షయ నివారణపై ఆయన ఎన్నో కళాప్రదర్శనలిచ్చారు. ఆ ప్రదర్శనలను చూసి ముగ్ధులైన ప్రస్తుత డీఎంహెచ్‌వో మాలతి, డీటీసీవో సుబ్బారావు ఆయన్ను ఇటీవల గుజరాత్ పంపించారు. టీబీ నివారణపై నిర్వహించిన ‘నేషనల్ సమ్మిట్‌లో కళా ప్రదర్శన ఇప్పించారు. అంతేకాదు ఈ ప్రదర్శనకు లాంకా కొండయ్య ‘బెస్ట్ టీబీ అవేర్నెస్’ అవార్డు అందుకున్నారు.
అందుకున్న పురస్కారాలివీ..
2003లో నాటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు, 2008లో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు, 2013లో గ్లోబల్ పీస్ ఇండియా న్యూ ఇంటర్ నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ కమిటీ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అంబాసిడర్ డాక్టర్ ఏలూరి శ్రీనివాసరావు, జపాన్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సేవకుల చేతుల మీదుగా ‘మేన్ ఆఫ్ ది చారిటీ’ అవార్డు, 2018లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా ‘బెస్ట్ అవేర్నెస్’ అవార్డు, 2019లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ‘బెస్ట్ సోషల్ వర్కర్’ అవార్డు, తర్వాత మధిర రామభక్త సీతయ్య కళాపరిషత్ సభ్యుల చేతుల మీదుగా ‘మధిర ఆశామిత్ర’ అవార్డు అందుకున్నారు. ఇవేకాక ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు జిల్లా జడ్జీలు, ముగ్గురు డీఎంహెచ్‌వోల చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డులు పొందారు. మదర్‌థెరిస్సా సేవా సంస్థ సభ్యుల చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నారు.