భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. లక్ష్యానికి మించి పోలియో చుక్కలు వేశారు. ఇంటింటికీ తిరిగారు… పొలం పనుల వద్ద, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇటుక బట్టీలు, వలస కూలీల వద్దకు వెళ్లి ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు పోలియో చుక్కలు వేసి శభాష్ అనిపించుకున్నారు. పోలియోరహిత జిల్లాగా ఉండాలన్నదే లక్ష్యంగా ముందుకెళ్లారు. జిల్లావ్యాప్తంగా 97,522 మంది పిల్లలు ఉండగా మూడు రోజుల్లో 98,358 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసి సక్సెస్ అయ్యారు.
98,358 మందికి పోలియో చుక్కలు
కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు మూడురోజులపాటు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసుకుని సక్సెస్ చేసింది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు జిల్లాలో 97,522 మందిని గుర్తించారు. వీరందరికీ ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. 925 కేంద్రాల్లో, 93 రూట్లలో 33 మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర ప్రాంతాల్లో 38 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 114 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పోలియో చుక్కలు వేశారు. హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అంగన్వాడీలు 2,060మంది, ఆశలు 1,440 మంది మొత్తం 3,700మంది సిబ్బంది సేవలందించారు.