ఖమ్మం కల్చరల్/ రఘునాథపాలెం, మార్చి 1: ఆలయాల్లో కొలువైన త్రినేత్రుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం జలం, పంచామృతాలతో అభిషేకం, పలు దళాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అత్యంత కమనీయంగా, శాస్ర్తోక్తంగా నిర్వహించగా.. భక్త కోటి తిలకించి పులకించింది. తీర్థాల సంగమేశ్వరస్వామిని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, టీఆర్ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర సహా ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకుని పూజలు చేశారు. ఖమ్మంలోని ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కేఎంసీ మేయర్ నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న కిరణ్‌కుమార్, మంత్రి పీఏ చిరుమామిళ్ల రవికిరణ్, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య నాగరాజు, శీలంశెట్టి రమా వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, పసుమర్తి రామ్మోహన్, ప్రసన్నకృష్ణ, మేడారపు వెంకటేశ్వర్లు, సీఐ అంజలి, జ్యోతిరెడ్డి, సుడా డైరెక్టర్ కిశోర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామిని దర్శించుకుని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణబజార్ బ్రమరాంబ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న దంపతులు మంత్రి అజయ్‌కుమార్, కుటుంబ సభ్యుల పేరిట గోత్ర నామార్చనలు, రుద్రాభిషేకం నిర్వహించారు.
రఘునాథపాలెం మండలంలో..
ఖమ్మం పాండురంగాపురంలోని శ్రీ రామలిగేశ్వర స్వామి ఆలయంలో ప్రాతఃకాలం నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని బోళాశంకరుడికి మొక్కులు చెల్లించుకున్నారు. వీ వెంకటాయపాలెంలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. కైకొండాయిగూడెం రోడ్డులోని విశాలక్షి సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయంలో స్వామి వారి కల్యాణం, అన్నదాన కార్యక్రమంలో మేయర్ పునకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ధంసలాపురంలోని శంభులింగేశ్వర ఆలయం శివరాత్రి సందర్భంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఏళ్లనాటి ఆలయం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రివేళ ఆయా ఆలయాల్లో జరిగిన శివపార్వతుల కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కనులారా వీక్షించారు.