కల్లూరు రూరల్, సెప్టెంబర్ 21: దళిత, గిరిజనుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఆయన ఆకాంక్ష అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనుకబడే ఉన్నారని, ఆర్థికంగా వారు అభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ ఆరాట పడుతున్నారని అన్నారు. అందుకోసం ఇప్పటికే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఇక నుంచి గిరిజన బంధు పథకాన్ని కూడా అమలు చేయనున్నారని అన్నారు.
కల్లూరు మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. ముగ్గువెంకటాపురం, పేరువంచ, చండ్రుపట్ల, రఘునాథగూడెం, చెన్నూరు, ఎర్రబోయినపల్లి, యజ్ఞనారాయణపురం, ఓబులరావుబంజర, ముచ్చవరం గ్రామాల్లోని లబ్ధిదారులకు నూతన పింఛన్ గుర్తింపు కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. దళితబంధు మాదిరిగా ప్రతి గిరిజన కుటుంబానికీ రూ.10 లక్షల సాయం అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని ప్రకటించారని, త్వరలోనే దానిని అమలు చేస్తారని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సామాజిక పింఛన్ల మొత్తాన్ని రూ.900 మాత్రమే అందిస్తుండగా తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం రూ.2016, రూ.3016 చొప్పున అందిస్తున్నారని గుర్తచేశారు. తెలంగాణ నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడమనేది రాష్ట్రంలోని దళిత, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. బీజేపీ నేత బండి సంజయ్కు దమ్ముంటే ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టించాలని సవాల్ విసిరారు. అనంతరం రఘునాథగూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. అదే గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.