భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 19 : అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఉదయం మొదలైన వాన ముసురు సాయంత్రం వరకు కొనసాగింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఖమ్మం నగరంతోపాటు వివిధ పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. రోజువారీ పనుల కోసం నగర పరిసర మండలాల నుంచి నగరానికి వచ్చిన కూలీలు.. పనులు లేక వెనుదిరిగారు. ప్రస్తుతం గ్రామాల్లో జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులకు కొంత ఆటంకం కలిగింది.
మిర్చి తోటల్లో కలుపుతీత, పత్తి చేలలో పత్తితీత పనులకు అంతరాయం ఏర్పడింది. పంట చేతికి వచ్చే సమయంలో ముసురు పట్టడంతో పెసర రైతులు ఆందోళనకు గురయ్యారు. పంట పొలాల్లో నిలిచిన వరదను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో..
మంగళవారం రోజంతా కురిసిన వర్షంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతా తడిసి ముద్దయింది. కిన్నెరసానిలోకి భారీగా నీరు చేరడంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ముర్రేడు, చీకటి వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. అశ్వాపురం మండలంలో అత్యధికంగా 40 మిల్లీమీటర్లతోపాటు కరకగూడెంలో 36, జూలూరుపాడులో 23, దుమ్ముగూడెంలో 22, సుజాతనగర్లో 19, దమ్మపేటలో 17, పాల్వంచలో 16, భద్రాచలంలో 15, మందలపల్లిలో 15 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.