ఖమ్మం రూరల్, మార్చి 1 : సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తీర్థాల(కూడలి) పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఎటుచూసినా భక్తులు కనిపించారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ ఊహించని విధంగా భక్తులు రావడంతో కొంతమేర భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. అప్పటికప్పుడు సంబంధిత అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి తరువాత పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ వరప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఇతర నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారే సమయానికి భక్తులు భారీగా తరలిరావడం కనిపించింది. సంగమేశ్వర ఆలయానికి మూడువైపులా ప్రధాన రహదారులు ఉదయం 10గంటల తరువాత వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పార్కింగ్ స్థలాల్లో వాహనాలు పూర్తిగా నిండిపోవడంతో తదుపరి వాహనాలను పార్కింగ్ చేయించేందుకు పోలీస్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై శంకర్రావు సమయస్ఫూర్తిగా వ్యవహరించి వన్‌వే మార్గాల ద్వారా వాహనాలను నియంత్రించారు.
జాతరకు వచ్చే భక్తులకు వైద్య, ఇతర సహాయం అందించేందుకు వైద్యాధికారులు, పంచాయతీ, రెవెన్యూ అధికారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆకేరు, మున్నేరువాగులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో స్నాన ఘట్టాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. ఉదయం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, విజయమ్మ దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్ నీరజ, అడిషనల్ ఎస్పీ సుభాష్‌చంద్రబోస్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రెండురోజులుగా తీర్థాలలో మకాం వేసిన తహసీల్దార్ సుమ, ఎంపీడీవో అశోక్, ఈవో భీమవరపు సూర్యప్రకాశ్ నిరంతరం అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సలహాలు, సూచనలు చేశారు. వీరితోపాటు సర్పంచ్ బాలూనాయక్ అవసరమైన మేర సేవలందించారు. ఎన్నడూ లేనివిధంగా మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ నుంచి సైతం ఊహించని విధంగా భక్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ శివపార్వతుల కల్యాణానికి అర్చకులు ఏర్పాట్లు చేశారు.