ఖమ్మం, సెఫ్టెంబర్ 15: పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణ మాత్రలతోనే సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఇందుకోసం 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నులి పురుగుల నివారణ ప్రోగ్రాంలో భాగంగా ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల విద్యార్థులకు నులి పురుగల నివారణ మందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని అన్నారు. కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. అందుకని విద్యార్థులు తప్పకుండా శుభ్రత పాటించాలని సూచించారు. కాగా, ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా రిక్కాబజార్ ప్రభుత్వ పాఠశాలకు రూ.50 లక్షలను మంజూరు చేసినట్లు చెప్పారు.
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, కార్పొరేటర్ విజయ, ఎంఈఓ శ్రీనివాసరావు, విద్యాకమిటీ చైర్మన్ రాజేశ్వరి, హెచ్ఎం కే.వెంకటేశ్వరరావు, డాక్టర్ సైదులు, చందన, కేఎంసీ ఈఈ కృష్ణలాల్, టీఆర్ఎస్ నాయకలు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.