‘సృష్టకర్త ఒక బ్రహ్మ.. అతడిని సృష్టించినదొక అమ్మ..’ అంటూ సాహిత్యంలో అమ్మతనం గొప్పదనాన్ని విశ్లేషించారు అప్పుడెప్పుడో వచ్చిన ‘అమ్మ రాజీనామా’ చిత్రంలో దర్శకరత్న దాసరి నారాయణరావు. అక్షరసత్యమైన ఆ పలుకులు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి. పంటి బిగువున పురిటి నొప్పులు బిగపట్టి బిడ్డకు జన్మనిచ్చిన దగ్గర నుంచి ఆఖరి గడియ వరకూ తన బిడ్డపై అమ్మ చూపించే అనురాగానికి ఏ మాటలూ సరితూగనివి. ఈ చిత్రాల్లో కన్పిస్తున్న అమ్మ ప్రేమ వర్ణనలకందని భావమంటే అతిశయోక్తి కాదేమో. మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద మంగళవారం నిర్వహించిన జాతరలో కీ చైన్లు, తెల్ల పూసలు విక్రయించుకునేందుకు వచ్చింది ఓ రాజస్తానీ మహిళ. మండుటెండనూ లెక్క చేయకుండా బేరం చేస్తున్న ఆ మాతృమూర్తి.. సుమారు ఏడాది వయసున్న తన చిన్నారికి మాత్రం భానుడి కిరణం తాక కుండా జాగ్రత్త పడింది. తాను కూర్చున్న పక్కనే సరుకుల సంచిని నిలిపి ఉంచి.. దానిపైన సమాంతర కప్పును ఏర్పాటు చేసింది. దానిపై శాలువా, మందపు పరదాను కప్పి గొడుగులా తయారు చేసింది. దాని నీడలో తన చిన్నారిని నిద్రపుచ్చుతూ బేరం చేసింది. రోజంతా తాను మండుటెండలో మాడిపోతూ తన చంటి బిడ్డను భానుడి భగభగల నుంచి రక్షించుకుంది. మాతృప్రేమను చాటుకుంది.
-ఫొటోలు, నమస్తే తెలంగాణ ఖమ్మం ఫొటోగ్రాఫర్