సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 9 : రాష్ర్టానికి నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. గవర్నర్ తమిళిసై కూడా రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడినందువల్లనే అప్పట్లో ఎన్టీఆర్.. గవర్నర్ వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలకు చేయూతనివ్వాలని కోరారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన సత్తుపల్లి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీలోని 1, 2, 3, 12, 13, 14, 15, 16, 17 వార్డుల్లో ఆయా లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందనప్పటికీ పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. కాగా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు ఎమ్మెల్యే సండ్ర తన సొంత ఖర్చుతో ఖరీదైన చీరెలను పెళ్లికుమార్తెలకు అందజేసి వారిని ఆశీర్వదించారు. 10 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.6 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా పంపిణీ చేశారు. జోరువానలోనూ ఎమ్మెల్యే పర్యటించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, సుజాత, శ్రీనివాసరావు, సలీమా ఖాతూన్, నాగేంద్ర, మారుతి సూరిబాబు, వల్లభనేని ప్రవీణ్, వీరపనేని రాధిక, మేకల సత్యవతి, మట్టా ప్రసాద్, రఫీ, మల్లూరు అంకమరాజు, వీరపనేని బాబీ, కొత్తూరు ప్రభాకర్‌రావు, మాధురి మధు, వల్లభనేని పవన్ తదితరులు పాల్గొన్నారు.