భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘ఎలమందలు చెంగు చెంగున ఎగరాలి.. ఒకటికి రెండు, రెంటికి నాలుగింతలవ్వాలి.. గొర్రెల కాపరుల ఇంట సిరులు కురిపించాలి.. వెనుకబడిన కులవృత్తి జీవం పోసుకోవాలి.. ఎనకటి వైభవం తిరిగి రావాలి.. ప్రతి ఇంటా చిరునవ్వులు విరియాలి..’ అన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ గొల్ల కురుముల అభ్యున్నతికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా 2018లో భద్రాద్రి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 7,511 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందాయి. ఒక్కో లబ్ధిదారుడు నాడు రూ.31,750 డీడీ ద్వారా సొమ్ములు చెల్లించారు. జీవాలను పెంచుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. యలమందను రెట్టింపు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం రెండో విడత యూనిట్ల పంపిణీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే డీడీల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలో లబ్ధిదారులకు యూనిట్లు అందనున్నాయి.
జిల్లాలో వేలాది మందికి లబ్ధి..
రెండో విడత గొర్రెల పంపిణీ ద్వారా జిల్లావ్యాప్తంగా 3,549 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనున్నది. వీరిలో 1,104 మందిలో ఒక్కొక్కరూ రూ.43,750 చొప్పున డీడీలు చెల్లించారు. మిగతా లబ్ధిదారులు డీడీలు చెల్లించగానే పశుసంవర్థకశాఖ అధికారులు పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ నెల చివరి కల్లా పంపిణీ ప్రక్రియ పూర్తికానున్నది. ఒక్కో యూనిట్‌కు రూ. 1,75,000 కేటాయించి 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారులు డీడీలు చెల్లింపునకు ఇబ్బంది పడకుండా అధికారులు నేరుగా కలెక్టర్ అనుదీప్ ఖాతాలో సొమ్ములు జమ చేసేలా వెసులుబాటు కల్పించారు. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పాయి. గతంలో వారు పశుసంవర్థకశాఖ కార్యాలయం చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే డీడీ సొమ్ము కలెక్టర్ ఖాతాలోకి జమ అవుతున్నది.
దళారులకు ఆస్కారమే లేదు..
గొర్రెల యూనిట్ పంపిణీ ప్రక్రియలో పశుసంవర్థక శాఖ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన నిబంధనలను అమలు చేస్తున్నది. దళారుల ప్రమేయానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నది. గతంలో అధికారులు జీవాలను ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? ఏ రాష్ర్టానికి వెళ్తున్నారు? అనే అంశాలు ముందే బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ విషయాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. వారు జీవాలను తీసుకొచ్చిన తర్వాత పంపిణీకి కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే లబ్ధిదారులకు సమాచారం ఇవ్వనున్నారు. వారి కేటాయించిన కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు యూనిట్లను పంపిణీ చేస్తారు. జీవాలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు లబ్ధిదారుల ఇంటికి జీవాలు చేరిన తర్వాతే పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ రశీదు ఇస్తారు. ఆ తర్వాతే డీడీ ద్వారా సొమ్ముల బట్వాడా జరుగుతుంది.