ఆమెతో పాటు మరో సభ్యురాలు..
వివరాలు వెల్లడించిన భద్రాద్రి ఎస్పీ వినీత్
కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 8 : మావోయిస్టు నేత దామోదర్ భార్య చర్ల ఏరియా కమిటీ మెంబర్ రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడు, ప్రస్తుతం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రేసులో ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్, అతని భార్య మడకం కోలి అలియాస్ రజిత, మరికొందరు దళ సభ్యులు చర్ల మండలంలో సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. బుధవారం మధ్యాహ్నం చర్ల మండలంలోని కుర్నపల్లి, బోదనెల్లి మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తాధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించగా ఈక్రమంలో కొందరు భద్రతా దళాలను చూసి పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన జవాన్లు, పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
ఒకరిని మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు రజితగా, మరో మహిళను ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దబ్బపాడు గ్రామానికి చెందిన దళ సభ్యురాలు మడివి ధనిగా గుర్తించారు. వారి నుంచి నాలుగు పెన్ డ్రైవ్‌లు, 20 జిలిటెన్ స్టిక్స్, రెండు డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, టార్చ్లైట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి గతంలో పలుచోట్ల చోటుచేసుకున్న విధ్వంసాలతో ప్రమేయం ఉన్నట్లు విచారణంలో తేలింది. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టుల వివరాలు, వారికి సహకరిస్తున్న మద్దతుదారుల వివరాలను వెల్లడించినట్లు ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల ఆదేశాల మేరకే ఇర్పా రాములు అనే వ్యక్తిని హత్య చేసినట్లు అంగీకరించారన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ స్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ పావులు కదుపుతున్నాడన్నారు. దీనిలో భాగంగానే దామోదర్, రజిత దంపతులను వాడుకుంటున్నాడన్నారు. అజాద్ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, బాలికలను బలవంతంగా పార్టీలోకి తీసుకురావడం, గిరిజనులు, ఆదివాసీల సమస్యలను పట్టించుకోకపోవడం, హత్యలు అకృత్యాలకు పాల్పడతుండడంతో కొందరు మహిళా మావోయిస్టులు తమకు సమాచారం ఇస్తున్నారన్నారు. మావోయిస్టు పార్టీకి సహకరించే వారు పోలీసుల ఎదుట లొంగిపోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు, చర్ల సీఐ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.