మామిళ్లగూడెం, సెప్టెంబర్ 8: దరఖాస్తులను నిర్ణీత కాలంలోపు పరిష్కరించేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ధరణికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిషరించాలని సూచించారు. మిస్సింగ్ ఖాతాలకు సంబంధించి దరఖాస్తులపై చర్యలు తీసుకొని తదుపరి మంగళవారంలోపు క్లియర్ చేయాలని ఆదేశించారు.
ఎలక్ట్రికల్ వెహికిల్స్ చార్జింగ్ పాయింట్ల కోసం మండలానికి కనీసం ఒకటి చొప్పున వేయి చదరపు గజాల స్థలాన్ని గుర్తించాలన్నారు. వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాలకు పంపిన ప్రతిపాదనల విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. బీఎల్‌వోలందరూ గరుడ యాప్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ ప్రజావాణి దరఖాస్తుల పరిషారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ర్యాలీకి మైదానం, భోజన ఏర్పాట్లలో ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా, డిఆర్వో శిరీష, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాము, కలెక్టరేట్ ఏవో మదన్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.