మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, ఫిబ్రవరి 28: జిల్లాలో ఆయిల్‌పాం తోటల బిందు సేద్యం లక్ష్యాలను వారం రోజుల్లోపు పూర్తి చేసి పురోగతి సాధించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్‌పాం తోటల బిందు సేద్యం పథకం అమలుపై ఉద్యానవన శాఖ అధికారులతో సోమవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 1200 హెక్టార్ల లక్ష్యానికిగాను ఇప్పటి వరకు కేవలం 476 హెక్టార్లలో మాత్రమే పురోగతి సాధించినట్లు చెప్పారు. మిగిలిన హెక్టార్ల పూర్తి లక్ష్యాన్ని వారం రోజులలోపు చేరుకునే విధంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. బిందు సేద్యం సబ్సిడీని హెక్టారుకు రూ.29 వేల నుంచి రూ.42 వేలకు పెంచినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ అందుతోందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకునేలా ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతగా పని చేయాలని సూచించారు.
అర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలి
ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలపై అర్జీలు అందాయి.
కొత్త కలెక్టరేట్ పనులు త్వరగా జరగాలి
సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నిర్దేశించిన లక్ష్యం మేరకు జరగాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రతి వారం కొత్త కలెక్టరేట్ పనుల పురోగతిని పరిశీలిస్తున్న ఆయన సోమవారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన పనులు జరగాలన్నారు. పనులు చేపట్టే సమయంలోనూ భద్రతా చర్యలు తప్పక పాటించాలని గుత్తేదారులు, అధికారులకు సూచించారు. అనంతరం రఘునాథపాలెంలోని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లెప్రకృతి వనాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వాక్‌వే, విద్యుత్ దీపాలు, ట్యాంక్‌బండ్ నిర్వహణ పనులు వేగవంతం చేయాలన్నారు.