కరకగూడెం, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సోమవారం కరకగూడెం మండలంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. ముందుగా గొల్లగూడెం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన జీసీసీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతారంలో రూ.20 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్‌సెంటర్, మోతే భట్టుపల్లి, సమత్ భట్టుపల్లి పంచాయతీల్లో వేర్వేరుగా ఒక్కొక్క హెల్త్ సబ్ సెంటర్‌కు రూ. 14 లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఎంపీపీ రేగా కాళిక, జడ్పీటీసీ కొమరం కాంతారావు, ఐటీడీఏ ఈఈ రాములు, జీసీసీ డీఎం వాణి, ఎంపీడీవో శ్రీను, తహసీల్దార్ విక్రమ్‌కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
అన్ని హంగులతో తీర్చిదిద్దాలి
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను అన్ని హంగులతో తీర్చిదిద్ది లబ్ధిదారులకు సకాలంలో అందజేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. బంగారుగూడెంలో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న 20 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తామన్నారు. అనంతరం కల్వలనాగారం- కన్నాయిగూడెం మధ్య గల ఒర్రెపై రూ.30 లక్షలతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. సమత్ భట్టుపల్లి పంచాయతీలో ప్రారంభమైన క్రికెట్ టోర్నిలో భాగంగా వైఆర్ఎస్ యూత్ సభ్యులకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు విప్ రేగాకు వినతిపత్రం అందజేశారు. అందుకు స్పందించిన రేగా.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.