రఘునాథపాలెం, ఆగస్టు 23: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తనయుడు నయన్‌రాజ్ – అపర్ణల వివాహ రిసెప్షన్ వేడుక ఖమ్మంలో వైభవంగా జరిగింది. నగరంలోని టేకులపల్లిలో ఉన్న మమత సొసైటీ స్థలంలో మంగళవారం జరిగిన ఈ వేడుకకు అతిథులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనా కల్యాణ మండపంలో ఏడడుగులు నడిచి ఒక్కటైన ఈ జంట.. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం చేరుకున్నది.
మమత కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నూతన వధూవరులకు మమత ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం 11:30 గంటలకు టేకులపల్లిలోని మమత సొసైటీ స్థలంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేదిక వద్దకు నూతన వధూవరులు నయన్‌రాజ్-అపర్ణలతోపాటు మంత్రి అజయ్‌కుమార్, వసంతలక్ష్మి దంపతులు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం నూతన వధూవరులు వేదికపై ఆశీనులయ్యారు. ముందుగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు వరుసగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసి నూతన జంటను ఆశీర్వదించారు.
హాజరైన ప్రముఖులు
రిసెప్షన్ వేడుక సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు.