దుమ్ముగూడెం/ పర్ణశాల, ఆగస్టు 2: వరద బాధితులకు ఎత్తయిన ప్రదేశంలో ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్.. అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పర్యటించిన ఆయన.. శాశ్వత నిర్మాణాల కోసం భూములను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. వరద ప్రభావిత గ్రామాలైన సున్నంబట్టి, కాశీనగరం, వర్క్‌షాప్ తదితర గ్రామాల ప్రజలను ఎత్తయిన ప్రదేశానికి తరలించి అక్కడ వారు శాశ్వతంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలను గుర్తించేందుకు అధికారులతో వచ్చిన ఆయన.. ఆయా ప్రాంంతాల్లో భూములను పరిశీలించారు.
రామచంద్రాపురంలోని 32/3 సర్వేలో 15.14 ఎకరాలను, దుమ్ముగూడెంలో 170 సర్వే నెంబర్లో ఎకరం, 176 సర్వేలో 4.24 ఎకరాలు, చిన్నబండిరేవులో 20 ఎకరాలు, అంజిపాకలో మరికొంత భూమి ఉండగా వాటిని పరిశీలించారు. దుమ్ముగూడెం ప్రభుత్వ వైద్యశాల సమీపంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రీడా మైదానానికి రూ.2 కోట్లు మంజూరు కావడంతో అక్కడి ప్రభుత్వ స్థలాన్ని కూడా పరిశీలించారు. దుమ్ముగూడెం హెడ్లాక్లు నావిగేషన్ కెనాల్, గోదావరి కరకట్టను పరిశీలించారు.
భూముల ప్రదేశంలోనే అధికారులతో అడంగల్ పత్రాలను తెప్పించి వాటిని పరిశీలించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వోలను ఇతర శాఖలకు బదలాయించినందున వారంతా త్వరితగతిన నూతన పోస్టింగుల్లో చేరేందుకు ఆయా అధికారుల వద్ద వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు కూడా వారికి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని సూచించారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, సీఐ దోమల రమేశ్, ఎంపీడీవో చంద్రమౌళి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీవో ముత్యాలరావు, ఎస్సై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగళ్లపల్లి లిఫ్ట్‌కు మరమ్మతులు చేయించండి
గోదావరి వరదల కారణంగా మండలంలోని ప్రగళ్లపల్లి లిఫ్ట్ పూర్తిగా మునిగిపోయినందున దానికి వెంటనే మరమ్మతులకు చేయించాలని జడ్పీటీసీ, ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఆయకట్టు చైర్మన్ తెల్లం సీతమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణమూర్తిలు.. కలెక్టర్ అనుదీప్‌ను కోరారు. మంగళవారం మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ను వారు కలిసి విన్నవించారు.