మణుగూరు టౌన్, జూలై 21: గోదావరి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచి ఆపద్బాంధవుడయ్యారు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఓ వైపు గోదావరి ప్రవాహం పెరుగుతున్నా నాటు, మోటారు పడవల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇళ్లను వదల లేక, ఎక్కడికి వెళ్లాలో తెలియక.. ముంపు ముంచుకొస్తున్నా తమ ఇళ్లలోనే ఉంటున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. వారిని ఒప్పించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులను సైతం సహాయక చర్యల్లోకి దింపారు. అధికారులను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయించడం, బాధితులను తరలించడం, అందులో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టారు. వరదలతో గోదావరి పరీవాహకంలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లో ఉన్న లోతట్టు గ్రామాలను చుట్టుముట్టాయి. జూలై నెలలోనే అనూహ్యంగా వరదలు రావడం, గంటల వ్యవధిలోనే ప్రవాహం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ముంపునకు గురయ్యాయి. బాధితులంతా బిక్కుబిక్కుమంటున్న వేళ.. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తక్షణమే స్పందించారు. వర్షాలు, వరదలను సైతం లెక్కచేయకుండా పగలూరాత్రీ వేళల్లోనూ ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టారు. బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాక అన్ని కేంద్రాలకు వెళ్లి వారిని పరామర్శించారు. భయాందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పాక్షికంగా మునిగిన ప్రాంతాల్లోనూ మోటారు బోటుపై ప్రయాణిస్తూ మైకు ద్వారా సూచనలు చేస్తూ బాధితులకు అవగాహన కల్పించారు. ఐటీసీ, సింగరేణి ఉన్నతాధికారులను కలిసి.. బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, తక్షణమే ఆదుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన ఆయా సంస్థల ఉన్నతాధికారులు తక్షణమే బాధితులకు భోజన వసతులు సహా అన్ని సదుపాయాలూ కల్పించారు. నియోజకవర్గంలోని 13 వేల కుటుంబాలకు నేరుగా 10 కిలోల బియ్యం, కిలో ఆయిల్, కందిపప్పు, కారం, పసుపు వంటివి అందిస్తామని హామీ ఇచ్చి అమలుకు ప్రణాళిక చేస్తున్నారు.