బూర్గంపహాడ్, జూలై 15: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూడు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రవహిస్తున్నది. వరదల ధాటికి బూర్గంపహాడ్ మం డల కేంద్రంతో పాటు గొమ్మూరుకాలనీ, నాగినేనిప్రోలురెడ్డిపాలెం జలదిగ్బంధమయ్యాయి. బూర్గంపహాడ్‌లో ఏళ్ల చరిత్ర ఉన్న తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, ప్రధాన సెంటర్లోని షాంపింగ్ కాంప్లెక్స్‌లు నీట మునిగాయి. మండల కేంద్రం పక్కనే ఉన్న ఉన్న సంజీవరెడ్డిపాలెం, గొమ్మూరు సైతం వరదనీటిలో ఉన్నాయి. వరద అంతకంతకు పెరుగుతుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 18 వేల మంది ముంపువాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాత్రి మరో 3 వేల మందిని తరలించారు. పునరావాస కేంద్రాలను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సందర్శించారు. వరద బాధితులకు దుప్ప ట్లు పంపిణీ చేశారు. అనంతరం కేంద్రంలో తానే స్వయంగా వంట చేసి బాధితులకు వడ్డించారు.
ఉలిక్కిపడిన బూర్గంపహాడ్..
వరద ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు బూర్గంపహాడ్‌లోని మార్కెట్‌యార్డ్, కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరదబాధితులకు సహాయ సహకారాలు అందించారు. గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో పునరావాస కేంద్రాల్లోకి వరద చేరింది. దీంతో మండలకేంద్ర వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. బాధితులను అక్కడి నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలైన లక్ష్మీపురం, మోరంపల్లి బంజరకు తరలించారు. అక్కడి పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
జల దిగ్బంధంలో పారిశ్రామిక వాడ
సారపాక, జూలై 15: బూర్గంపహాడ్ మండలంలోని మోతే పట్టీనగర్, సారపాకలోని పాత సారపాక, భాస్కర్‌నగర్, సుందరయ్యకాలనీ, గాంధీనగర్, బసప్పక్యాంప్, తాళ్లగొమ్మూరు ప్రాంతాలు గోదావరి వరదలకు నీటమునిగాయి. సారపాక- నాగినేనిప్రోలురెడ్డిపాలెం, ఇరవెండి- అశ్వాపురం, మోతే రహదారులపై వరద నిలవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు వరద బాధితులను బీపీఎల్ స్కూల్, జడ్పీహెచ్ఎస్ స్కూల్, ఎమ్మెస్సార్ స్కూల్, తాళ్లగొమ్మూరు ఫంక్షన్‌హాల్ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రజలకు సహాయ సహకారాలు అందించింది. ఇప్పటివరకు మొత్తం 7 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద పరిస్థితులను ఎస్పీ వినీత్, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు సమీక్షించారు. సారపాక- భద్రాచలం బ్రిడ్జి వద్ద బందోబస్తును పరిశీలించారు. సారపాకలోని వీరభద్ర ఐటీఐ సమీపంలో ఓ వ్యక్తి వరదలో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ బృందం, టీఆర్ఎస్ నాయకులు ఆ వ్యక్తిని కాపాడి బయటకు తీసుకువచ్చారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు
కొత్తగూడెం క్రైం, జులై 15: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపువాసులు అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని భద్రాద్రి ఎస్పీ వినీత్ శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలు కంట్రోల్ నంబర్లు లేదా డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. – భద్రాద్రి ఎస్పీ వినీత్
1986 పరిస్థితి తలపించేలా ఉంది..
నేనెప్పుడూ ఇంత వరద చూడలేదు. 1986లో వచ్చినంత వరద మళ్లీ ఇప్పుడు చూస్తున్నా. వరదను చూస్తే నాటి పరిస్థితులు గురొచ్చాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. అప్పుడు ప్రభుత్వం నుంచి మాకు సరైన సౌకర్యాలు అందలేదు. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని అన్నివిధాలుగా ఆదుకుంటున్నది.
– ఇస్లావత్ కమల, బూర్గంపహాడ్
చిన్నారులు, గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ..
వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అధికారులు ముంపువాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వరద అనే భయం తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది. మేం నిశ్చింతగా ఉన్నాం.
– మూర్తి, బూర్గంపహాడ్