
కరకగూడెం, నవంబర్18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పంచాయతీ సర్పంచ్, సిబ్బంది ప్రజలకు విశిష్ట సేవలు అందించారు. ఈ సేవలకు గాను ఎన్ఐఆర్డీపీఆర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) బెస్ట్ కొవిడ్ కంట్రోల్ పంచాయతీగా కన్నాయిగూడెం గ్రామాన్ని ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా ఆరు పంచాయతీలను (రాజస్థాన్-1, అస్సాం-2, మణిపూర్-1, ఉత్తరాఖండ్-1, తెలంగాణ రాష్ట్రం నుంచి కన్నాయిగూడెం) ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో నిర్వహించే సంస్థ వ్యవస్థాపక ఉత్సవాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లకు పురస్కారాలను అందించనున్నారు. అంతేకాదు, గ్రామంలో వారు చేసిన సేవలను వివరించే అవకాశం కల్పిస్తున్నారు.