ఖమ్మం, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సరాసరి 19.08 సెం.మీ, భద్రాద్రి జిల్లాలో సరాసరి 10.08 సెం.మీ వర్షపాతం నమోదైంది. సింగరేణి మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల్లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం కారణంగా పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. రఘునాథపాలెం మండలంలోని బుగ్గవాగు పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్వయంగా జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. మణుగూరు మండలం సమితి సింగారంలో కోడిపుంజుల వాగు దాటేందకు యత్నించిన శంకర్ అనే వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీస్ అధికారులు కాపాడారు. దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ మహిళ గల్లంతైంది. కిన్నెరసాని, వైరా, పాలేరు రిజర్వాయర్, బేతుపల్లి చెరువు, తాలిపేరు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఎగువ కురిసిన వర్షాలకు గాను ఖమ్మం సమీపంలోని మున్నేరు వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వానల ఊపందుకోవడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 2.10 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. వానలు ఆశాజనకంగా ఉండడంతో సాగు విస్తీర్ణం మరింత పెరగనున్నది.