ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 15: గత పాలకుల హయాంలో విద్యా ర్థులకు అరకొరగా పుస్తకాలు అందేవి. కొన్నిచోట్ల విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరినా పుస్తకాలు పాఠశాలలకు చేరేవికావు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్‌కు దీటుగా విద్యనందించేం దుకు అన్ని పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. సకాలంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి పుస్తకాల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన పాఠాలను పొందుపరి చింది. అంతేకాదు, పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రతి పాఠ్య పుస్తకానికి ఒక కోడ్ నంబర్ ముద్రించి జిల్లాలవారీగా చేర వేస్తున్నది. దీనిద్వారా ఏ పాఠశాలలో ఏ పాఠ్యపుస్తకం పంపిణీ జరిగిందో సులభంగా తెలిసిపోతుంది. జిల్లాలో మొత్తం 1.5 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 7.12 లక్షల పుస్తకాలు అవసరం కాగా.. మొదటి విడతగా ఇప్పటికీ 95,700 పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించనున్నారు.
వేసవి సెలవులు ముగిశాయి.. స్కూళ్లు తిరిగి తెరుచుకున్నాయి.. విద్యార్థులకు తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరుగుతుండడంతో ప్రభుత్వం బైలింగ్వల్, నాన్ బైలింగ్వల్ విధానంలో పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ఒకే పుస్తకంలో తెలుగుతోపాటు ఇంగ్లిష్ మాధ్యమంలో పాఠశాలు పొందుపరిచింది. సమైక్య పాలనలో విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా విద్యార్థులకు పుస్తకాలు అందేవి కావు. కానీ తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల ముద్రణపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నది.
కోడ్ ఆధారంగా పంపిణీ..
ప్రభుత్వ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పారదర్శకతకు ప్రాధాన్య మిస్తూ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టనున్నది. ప్రతి పుస్తకానికి కోడ్ నెంబర్‌ను ముద్రించి ఇప్పటికే జిల్లాలకు చేరవేసింది. అక్కడి నుంచి కోడ్ నెంబర్ల ఆధారంగా విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాఠ్య పుస్తకాలు పక్క దారి పట్టకుండా కళ్లెం పడింది. ఒక వేళ పక్కదారి పట్టినా కోడ్ నమోదు ఆధారంగా విషయం బట్టబయలు అవుతుంది.
మండలాల వారీగా పంపిణీ..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్భా, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకులాలు వంటి పాఠశాలలు మరికొన్ని ఉన్నాయి. వీటిల్లో మొత్తం 1.5 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికే ప్రభుత్వమే ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నది. 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంతో కలిపి విద్యార్థులకు 174 రకాల పుస్తకాలు అవసరమని గుర్తించి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి జిల్లాకు 7.12 లక్షల పుస్తకాలు కేటాయించింది. మొదటి విడతగా ఇప్పటికే 95,700 పుస్తకాలు విద్యార్థులకు అందాయి. ఈ నెల 25 నుంచి పూర్తిగా పాఠ్య పుస్తకాలు అందనున్నాయి.
రెండు మాధ్యమాలకు అనుగుణంగా…
ఈ విద్యాసంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్న సంగతి విదితమే. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం బైలింగ్వల్తో పాటు నాన్ బైలింగ్వల్ పుస్తకాలను సిద్ధం చేసింది. పుస్తకాలు చదువుకునే అంశంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు వివరించనున్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియను డీఈవో యాదయ్య నిత్యం పర్యవేక్షిస్తున్నారు. డైస్ ఆధారంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. టెక్ట్స్‌బుక్ మేనేజర్, సెక్షన్ అధికారులను నిత్యం సమీక్షిస్తున్నారు. మండలాల వారీగా పుస్తకాలు ఇప్పటికే ఎమ్మా ర్సీకి చేరాయి. అక్కడి నుంచి ఎంఈవోల ఆధ్వర్యంలో పాఠశాలలకు సరఫరా అవుతాయి. ప్రధానోపాధ్యాయులు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.