పాల్వంచ రూరల్, జూన్ 15: మండలంలోని కిన్నెరసాని వాగుపై రాజాపురం – యానంబైలు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఏజెన్సీ వాసుల కలనెరవేరనున్నది. వర్షాకాలంలో వారు పడే కష్టాలు ఇక తీరనున్నాయి. మండలంలోని కిన్నెరసాని వాగు రాజాపురం – యానంబైలు మధ్య నుంచి వెళ్తున్నది. యానంబైలు అవతల ఉన్న దాదాపు ఇరవై గ్రామాల ప్రజలు లోలెవల్ వంతెన పైనుంచి పాల్వంచకు రాకపోకలు సాగించేవారు. అయితే వర్షాకాలంలో కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో వరదనీరు లోలెవల్ వంతెన పైనుంచి వెళ్తున్నది. వరద ఉధృతి ఎక్కువగా ఉంటే పగటి పూట కూడా గేట్లు ఎత్తే ఉంచేవారు.
దీంతో యానంబైలు అవతల ఉన్న మొండికట్ట, మందెరికలపాడు, ఉల్వనూరు, రేగులగూడెం, చంద్రాలగూడెం తదితర గ్రామాల ప్రజలకు పాల్వంచతో రాకపోకలు నిలిచిపోయేవి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు రెడ్డిగూడెం మీదుగా పాల్వంచ వచ్చేవారు. కిన్నెరసాని వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలంటూ ఈ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకులకు ప్రజలు విజ్ఞప్తులు చేసుకుంటూ వచ్చారు. చివరికి 2014లో బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రభుత్వం రూ.9.5 కోట్లను మంజూరు చేసింది. పలుసార్లు భూమిపూజా కార్యక్రమాలు జరిగినా పనులు ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో ఆరు నెల క్రితం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. పిల్లర్ల నిర్మాణం పూర్తి కావొచ్చింది. యానంబైలు వైపు అప్రోచ్ రోడ్డు కూడా సిద్ధమైంది. రాజాపురం వైపు ఒక పిల్లర్ నిర్మించాల్సి ఉంది. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కానుంది.
కల నెరవేరుతుంది: -కాలం నాగేశ్వరరావు, కొత్తూరు
మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. కిన్నెరసాని వాగుపై యానంబైలు వద్ద బ్రిడ్జి నిర్మాణ జరగడం చాలా సంతోషకరం. ఈ బ్రిడ్జి కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. వర్షాలోస్తే మేం ఇక్కడి నుంచి పాల్వంచ వైపు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఈ బ్రిడ్జి పనులు పూర్తయితే పాల్వంచకు రాకపోకలు సాగించేందుకు మాకు ఏ ఇబ్బందులూ ఉండవు.