ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడెం కల్చరల్, జూన్ 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మృగశిర కార్తె సందడి కనిపించింది. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో ఉన్న చెరువులు, ఇతర జలాశయాల్లో సైతం మత్స్య కార్మికులు చేపల వేట కొనసాగిస్తున్నారు. బుధవారం మృగశిర కార్తె ప్రారంభం రోజు కావడంతో మత్స్య పారిశ్రామిక సొసైటీల సభ్యులు ముందస్తుగా గ్రామాల చెరువుల్లోని చేపలను పెద్ద మొత్తంలో పట్టి ఖమ్మం నగరానికి, ఇతర పట్టణాలకు తీసుకొచ్చారు. ఆంధ్రా ప్రాంతం నుంచి సైతం కొందరు వ్యాపారులు దిగుమతి చేశారు. సాధారణ రోజుల మాదిరిగానే మార్కెట్లలో చేపల ధరలు అందుబాటులో ఉంచారు. తెల్ల రకం చేపలను కేజీ రూ.150 రూ.180 చొప్పున, నల్ల రకం చేపలను కేజీ రూ.350 రూ.450 చొప్పున విక్రయించారు.
ఖమ్మంలోని ఇంటిగ్రేటెడ్, బైపాస్ రోడ్, త్రీటౌన్ ప్రాంతాల్లోని చేపల మార్కెట్ల దగ్గర చేపలను కొనుగోలు చేసేందుకు తెల్లవారుజాము నుంచే నగరవాసులు బారులు తీరారు. ఏటా మృగశిర కార్తె రోజున చేపల వంటకం తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ప్రజల నమ్మకం. దీంతో కార్తె తొలిరోజున చేపల వంటకం ప్రతి ఇంట్లోనూ సాధారణమైంది. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. కార్మికులకు అవసరమైన వలలు, తెప్పలు, ఇతర వాహనాలను సైతం భారీ రాయితీపై అందిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఈసారి చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కొత్తగూడెంలో సింగరేణి హెడ్డాఫీస్, పెద్దబజార్, పాల్వంచ, జూలూరుపాడు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, రుద్రంపూర్‌లోని ప్రధాన సెంటర్లలో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు.

