ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 4: ఖమ్మంలోని జాతశ్రీ వేదికపై సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బుక్ రీడర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సాంకేతిక మాధ్యమాలు ఎన్ని పెరిగినా పఠన సంస్కృతి నిలిచి వెలుగుతుందని అన్నారు. కాగా, మూడో రోజూ బుక్ ఫెయిర్‌కు పాఠకుల పోటెత్తారు.
ఆలోచింపచేసిన మ్యాజిక్ షో..
ఈ బుక్ ఫెయిర్‌లో జన విజ్ఞాన వేదిక నిర్వహించిన మ్యాజిక్‌షో ఆలోచింపచేసింది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచనలు పెంపొందించే లక్ష్యంతో చేసిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పుస్తక మహోత్సవ సమన్వయకర్త అట్లూరి వెంకటరమణ, నిర్వాహకులు కోయ చంద్రమోహన్, ప్రసేన్, సీతారాం, మువ్వా శ్రీనివాస్, రవిమారుత్, ఐవీ రమణరావు తదితరులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
పోటీ పరీక్షలపై నేడు కలెక్టర్ దిశానిర్దేశం..
బుక్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు. ‘పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం ఎలా?’ అనే అంశంపై కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి దిశానిర్దేశం చేయనున్నారు.