రఘునాథపాలెం, జూన్ 2: ‘పుస్తకం’ కాగితం రూపంలో ఉండే విజ్ఞాన భాండాగారమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల గ్రౌండ్లో తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్ బుక్ ఫెయిర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జాతశ్రీ వేదికగా గురువారం ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను మంత్రి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ముందుగా స్టాళ్లను పరిశీలించి అందులోని పలు పుస్తకాలను చదివారు. పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని చూసి తాను చిన్నతనంలో చదివినట్లు జ్ఞాపకాలను నమరేసుకున్నారు.
మరోసారి చదవాలని ఉందని అన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత ప్రసేన్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మారుతున్న సాంకేతిక యుగంలో భవిష్యత్ తరాలకు పుస్తకం చదవడాన్ని అలవాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఒకప్పుడు గ్రంథాలయాల్లోని పుస్తకాలను తెచ్చుకొని పూర్తిగా చదివే వాళ్లమని గుర్తు చేశారు. కానీ నేడు డిజిటల్ పుస్తకాలు వచ్చి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివే అవకాశాలు లేకుండా చేశాయని అన్నారు. పుస్తకానికి ఉన్న విలువ ప్రపంచంలో మరే వస్తువుకూ ఉండదన్నారు. ఈ పుస్తకాల వల్లనే తెలంగాణ చరిత్ర మనగలిగిందని గుర్తుచేశారు.
ఉద్యమనేత కేసీఆర్‌ను నడిపించింది కూడా పుస్తకాలేనని మంత్రి ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన పుస్తక మహోత్సవాలను.. తెలంగాణ సాహిత అకాడమీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ పరిచయం చేస్తూ పుస్తక ప్రియుల అభిమానాన్ని చూరగొంటోందని అన్నారు. నాలుగేళ్లుగా ఖమ్మంలోనూ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది జూన్ 2 నుంచి 8 వరకు పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాక కరోనా సమయంలో ఎదుర్కొన్న అనుభవాలతో ఓ 20 ఏళ్ల యువకుడు ‘గులాబీ కవిత్వం’ పేరుతో రచించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
సన్మార్గంలో నడిపించేది పుస్తకమే..
పుస్తకం ప్రతి మనిషినీ సక్రమమైన మార్గంలోకి నడిపిస్తుందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పుస్తకం లేని గది మూ‘గది’ అంటూ చమత్కరించారు. కానీ నేటి సాంకేతిక యుగంలో క్రమక్రమంగా పుస్తకం చదివే అలవాటు తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికీ పుస్తకాన్ని చదివించడం అలవాటుగా మార్చాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులతో చర్చించి ఖమ్మంలోనూ ప్రదర్శన ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ జకీరుల్లా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బుక్ ఫెయిర్ నిర్వాహకులు చంద్రమోహన్, అట్లూరి వెంకటరమణ, సీతారాం, ఐవీ రమణ, రవి మారుత్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కేఎంసీ కార్పొరేటర్ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.