భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా ఆదివారం గాలిదుమారం బీభత్సవం సృష్టించింది. జనాన్ని అతలాకుతలం చేసింది. కొన్నిచోట్ల భారీగా, మరికొన్నిచోట్ల మోస్తరుగా వర్షం కురిసింది. ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఒక మోస్తరు వర్షంతోపాటు ఈదురు గాలులు వీచాయి. చర్ల మండలంలో భారీ వర్షం కురిసింది. అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇల్లందు మండలం మామిడి గుండాలలో గాలిదుమారానికి రేకుల ఇండ్లు నేలమట్టమయ్యాయి. అశ్వాపురం మండలంలోని కొన్ని రేకుల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చండ్రుగొండలో మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం రుద్రంపూర్లో రోడ్లపై చెట్టు పడిపోయింది. కొమ్మలు తగలడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కరకగూడెం మండలంలో..
కరకగూడెం, మే 8: మండలంలోని గొల్లగూడెం, కొత్తగూడెం పంచాయతీల్లో శనివారం రాత్రి గాలిదుమారం, అరగంటపాటు కురిసిన భారీ వర్షంతో జనం అతలాకుతలమయ్యారు. రేకుల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని ఇండ్ల గోడలు కూలిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
కొణిజర్ల మండలంలో..
కొణిజర్ల, మే 8: మండలంలో గాలి దుమారంతో అక్కడకక్కడ చెట్లు విరిగిపడ్డాయి. మోస్తరు వర్షం కురిసింది. వరి ధాన్యం, ఆరబోసిన మిర్చిపై రైతులు పట్టాలు కప్పారు. మామిడి కాయలు రాలిపడ్డాయి.
చర్ల మండలంలో..
చర్ల, మే 8: మండలంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. చినమిడిసిలేరు గ్రామంలో పిడుగుపాటుకు ఆవుదూడ మృతిచెందింది.
దుమ్ముగూడెం మండలంలో..
పర్ణశాల, మే 8: దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
ఇల్లెందు మండలంలో..
ఇల్లెందు రూరల్, మే 8: మండలంలోని మామిడి గుండాల పంచాయతీ చేపలవారి గుంపు, రాజ్యతండా, సువర్ణాపురం, మామిడి గుండాల గ్రామాల్లో ఈదురుగాలులకు రేకుల ఇండ్ల కప్పులు ఎగిరిపోయాయి. ఇండ్లలోని సామగ్రి ధ్వంసమైంది. టీవీలు, ఫ్రిజ్లు కాలిపోయాయి, వరి, మొక్కజొన్న తడిచింది, మామిడి పూత, కాయలు, రాలిపోయాయి.
అశ్వాపురం మండలంలో..
అశ్వాపురం, మే 8: మండలంలోని కల్యాణపురం గ్రామంలో గాలి దుమారానికి రెండు రేకుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
ములకలపల్లి మండలంలో..
ములకలపల్లి, మే 8: మండలవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి అక్కడక్కడ రేకుల షెడ్లు కూలాయి.
మధిర మండలంలో..
మధిర రూరల్, మే 8: మధిర పట్టణంతోపాటు మండలంలో పలుచోట్ల వర్షం, ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. చెట్లు కూలాయి. సిరిపురం గ్రామంలో పిడుగుపాటుకు తొమ్మది మేకలు మృతిచెందాయి. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిచింది.