ఖమ్మం కల్చరల్, మే 7: ‘హాంఫట్.. బాలా..’ అనగానే బాలనాగమ్మ కుక్కగా మారడం, కార్యవర్థి రాజు బండరాయిగా మారడం ఆసక్తిని కలిగించాయి. ‘ఏయ్ సంగు.. నన్ను ఢీకొనే వారెవరు?’ అంటూ రంగస్థలంపై మాయల ఫకీర్ సృష్టించిన మాయాజాలం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీసాయి సంతోషి సురభి నాట్య మండలి ఆధ్వర్యంలో నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాల్లో భాగంగా శనివారం బాలనాగమ్మ నాటకాన్ని ప్రదర్శించారు.
భూతాల గుహలో బాలనాగమ్మను కుక్కగా చేసి బంధించడం, వర్థిరాజు తన సోదరులతో యుద్ధానికి తలపడగా వారిని బండరాళ్లుగా మార్చడం వంటి సన్నివేశాలు సురభి కళాకారుల అద్భుత నైపుణ్యాన్ని చాటాయి. బాలనాగమ్మ కొడుకు బాలవర్థి తన తల్లి ద్వారా మరాఠి ప్రాణ రహస్యం చిలుకలో ఉందని తెలుసుకుంటాడు. ఆ చిలుకను తెచ్చి మరాఠీని సంహరించి, తన తల్లిదండ్రులను చెర నుంచి విడిపించుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
బాలనాగమ్మగా వెంగమాంబ, మాయల ఫకీర్‌గా సత్యనారాయణ, కార్యవర్థిగా వాసుదేవరావు, సంగుగా హారికా నాగసాయి, బాలవర్థిగా హేమాన్విసంతోషి ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ మాట్లాడుతూ నాటక ప్రదర్శనలకు సురభి సంస్థ ప్రత్యేకమైనదని అన్నారు. సభకు శ్రీసాయి సంతోషి నాట్య మండలి అధ్యక్షుడు సురభి సంతోష్ అధ్యక్షత వహించగా, డాక్టర్ నిభానపూడి సుబ్బరాజు, కళా పోషకులు కుతుంబాక కృష్ణప్రసాద్, రామదాసు కృష్ణమూర్తి, ఆకుల గణపతి, రాజారావు, పాలకుర్తి కృష్ణ పాల్గొన్నారు.