రఘునాథపాలెం, మే 4 : గోవు దైవంతో సమానమని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన పెళ్లిరోజు సందర్భంగా ఖమ్మం నగరంలోని 11గోశాలలకు బుధవారం 135ట్రాక్టర్ల వరిగడ్డిని వితరణ చేశారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లి గోశాల వద్ద జరిగిన వరిగడ్డి పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంకల్పం గొప్పదని, మహా పుణ్యకార్యంగా అభివర్ణించారు. సృష్టిలోని సకల జీవరాసులన్నింటి పట్ల కారుణ్య భావన ఉంటేనే మానవ మనుగడ సాధ్యమన్నారు. సృష్టిలో జీవించే హక్కు మానవులతోపాటు సకల జీవరాశులకూ ఉంటుందన్నారు. వ్యవసాయభివృద్ధి జరగాలంటే పశువులుంటేనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే గోశాలలకు గడ్డిని వితరణగా అందజేసినట్లు తెలిపారు. నానాటికీ తరిగిపోతున్న గోమాత విశిష్టత నేటి యువతరానికి తెలియదన్నారు. మూగజీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గడ్డిని వితరణ చేసేందుకు వచ్చిన ముదిగొండ, నేలకొండపల్లి మండలాలలకు చెందిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు కృష్ణచైతన్య, హనుమంతరావు, గోశాల బాధ్యులు శ్రీనివాసాచార్యులు, హనుమంతరావు, శేషగిరిరావు, బస్వేశ్వరరావు, సింహాద్రి యాదవ్, సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు మండలాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.