ఖమ్మం, మే 3: నేతన్న మోము చిరునవ్వుతో మెరిసిపోతున్నది. రైతుబీమా తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న బీమా’ పథకానికి శ్రీకారం చుట్టనుండడంతో సంబురపడుతున్నాడు. త్వరలో ప్రారంభించనున్న ఈ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో వెయ్యి మంది నేతన్నలు లబ్ధి పొందనున్నారు. చేనేత, పవర్లూమ్, యాన్సిలరీ కార్మికులు మరణిస్తే ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల బీమా ప్రభుత్వం అందజేయనున్నది. ఈ ధీమాతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా రెడిమేడ్ దుస్తులు మార్కెట్‌ను ముంచెత్తడంతో చేనేత కార్మికుల బతుకులు చిధ్రమయ్యాయి. అగ్గిపెట్టెలో ఆరడుగుల పట్టుచీరను అమర్చిన నేతన్న పొట్టచేత పట్టుకుని పొరుగు రాష్ర్టాల్లో బతికిన కుటుంబాలను ఎన్నో చూశాం.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో చేనేత రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోసి పునర్వైభవం తెచ్చారు. చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే చేనేత లక్ష్మి, నేతన్నకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాలను అమలుచేస్తూ ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. త్రిఫ్ట్ ఫండ్, కార్మికుడు మృతిచెందితే టెస్కో ద్వారా ఆర్థిక సాయం, నూలు కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ, రూ.5 లక్షల వరకు ఆరోగ్యబీమా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించనున్నది. ఈ మేరకు నిధులను కూడా మంజూరు చేసింది. రైతులకు ఏవిధంగానైతే రూ.5 లక్షల రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారో అదే మాదిరి చేనేత కార్మికులకు కూడా రూ.5 లక్షల నేతన్న బీమా పథకాన్ని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలోని చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెయ్యి మందికి బీమా వర్తింపు
ఖమ్మం జిల్లాలో 8 చేనేత సహకార సంఘాలున్నాయి. వీటిలో మధిర మండలంలోని సఖీనవీడు, మడుపల్లి, ఎర్రుపాలెం మండలంలోని చిలుకూరు, ఖమ్మంరూరల్ మండలంలో ఎం.వెంకటాయపాలెం, పొన్నెకల్లు, చింతకాని మండలంలోని పాతర్లపాడు, నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెం, తిరుమలాయపాలెంలోని కాకరవాయి గ్రామాల్లో సహకార సంఘాలున్నాయి. ఒక్కొక్క సంఘంలో దాదాపు వంద మందికి పైగా కార్మికులున్నారు. మడుపల్లి మినహా మిగిలిన సంఘాలన్నీ వస్ర్తాలను తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమలలో జిల్లాలో సుమారు వెయ్యి మంది కార్మికులున్నారు. వీరందరికీ నేతన్న బీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరిలో ఎవరైనా మరణిస్తే ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షలు బీమా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
నేతన్న అండగా కేసీఆర్ ప్రభుత్వం
చేనేత కార్మికులను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేనేత కార్మికుల అభ్యున్నతిపై ప్రభుత్వం దృష్టి సారించింది. బతుకమ్మ చీరెలను తయారుచేసే పని మొత్తం చేనేత కార్మికులు చేస్తుండగా దానికి తోడుగా మరికొన్ని పథకాలను అమలు చేస్తున్నది. వీటిలో త్రిఫ్ట్ ఫండ్ పథకం ఒకటి. ఈ పథకంలో సొసైటీల్లో సభ్యత్వం ఉన్న కార్మికులు ఎవరైనా రూ.1 నుంచి వెయ్యి రూపాయల వరకు ఏదైనా బ్యాంక్‌లో ప్రతినెలా పొదుపు చేసుకున్నట్లయితే వాటికి రెట్టింపు డబ్బులను జమ చేసి 3 సంవత్సరాల తరువాత అందజేస్తారు. జిల్లాలోని 8 సొసైటీల్లో పనిచేసే కార్యికుల మగ్గాలను జియోట్యాగింగ్ చేయకపోవడంతో ఇప్పటివరకు సుమారు 100మంది కార్మికులు మాత్రమే ఈ పథకం ద్వారా పొదుపు చేసుకుంటున్నారు. అదేవిదంగా కార్మికుడు మృతిచెందితే తక్షణ సాయం కింద టెస్కో ద్వారా రూ.12,500 అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇది కేవలం రూ.5 వేలు మాత్రమే ఉండేది. సీఎం కేసీఆర్ దీన్ని రూ.12,500కు పెంచారు. కార్మికులు కొనుగోలు చేసే నూలు ధరలో 50శాతం సబ్సిడీకి నూలును అందిస్తారు.
నేతన్నలకు ఉపాధి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చేనేత లక్ష్మి’ పథకం నేతన్నల ఉపాధికి భరోసా కల్పించింది. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేతనే. అనాది నుంచి ప్రపంచ ఖ్యాతిని దక్కించుకున్న మన చేనేత రోజురోజుకూ దిగజారిపోతున్నది. వేలాది మగ్గాలున్నా పరిశ్రమ… నేడు పదుల సంఖ్యకు పడిపోయింది. దీనికి తోడు గత ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యంతో చేనేత మగ్గం పడుగులు తెగి, నడుములు విరిగిపోయి చతికిల పడింది. దీనిస్థానంలో మరమగ్గాలు పోటీపడుతున్నాయి. రానురాను కనుమరుగయ్యే స్థితికి వచ్చిన చేనేతకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘చేనేతలక్ష్మి’ పథకం ప్రవేశపెట్టడంతో మూతపడిన సహకార సంఘాలు మళ్లీ పునర్జీవం పోసుకున్నాయి.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
సీఎం కేసీఆర్‌కు ప్రతి చేనేత కుటుంబం రుణపడి ఉంటుంది. మా కుటుంబాలకు పెద్దన్నగా ఉంటూ మా వృత్తికి పునర్జీవం పోస్తున్న కేసీఆర్ మా పాలిట దేవుడు. రూపాయి కూడా చెల్లించకుండా రూ.5 లక్షల బీమాగా ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పటికే అమలు చేస్తున్న రైతుబీమా ద్వారా ఎంతోమంది రైతుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. అలాంటి పథకాన్ని చేనేత కార్మికులకు వర్తింపజేయడం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనం.
– కమర్తపు మురళి, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్, ఖమ్మం
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న నేతన్న బీమాతో మా కుటుంబాలకు భరోసా కలిగింది. చేనేతకు వైభవం వచ్చింది. ఉత్పత్తి చేసే బట్టకు ధర కల్పించాలి. ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించేలా ప్రోత్సహించాలి. ఖమ్మంలో చేనేత పార్కును నెలకొల్పాలి. ప్రభుత్వం ఇంత గొప్ప పథకాలను అమలు చేయడం సంతోషం.
– బాలిన యాదగిరి, చేనేత కార్మికుడు,
ఎం.వెంకటాయపాలెం
నేతన్నలకు బతుకుపై భరోసా..
చతికిలపడిన చేనేత రంగాన్ని తిరిగిలేచేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలను పెట్టారు. ఇప్పుడు రైతుబీమా లాగా నేతన్న బీమాను పెట్టి మా జీవితాలకు భరోసా కల్పించారు. కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయంతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇతర రాష్ర్టాలకు వలసవెళ్లిన వాళ్లు సొంత ఊర్లకు వస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదు.
– కుసుమ హన్మంతరావు,చేనేత సంఘాల జిల్లా కన్వీనర్