ఖమ్మం ఏప్రిల్ 24: ఏప్రిల్ నెలాఖరుకే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఉదయం 10 గంటలు దాటకముందే నెత్తిపై నిప్పుల కుంపటి పెడుతున్నాడు.. ఉదయం సాయంత్రం వేళల్లోనే ప్రజలు బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సింగరేణి, పారిశ్రామిక ప్రాంతాలు వేడిమికి భగ్గుమంటున్నాయి.. ఆదివారం ఉభయ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది. ఇక మే లో సూర్యుడు ప్రచండుడై నిప్పుల వాన కురిపిస్తాడెమో.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ప్రకోపిస్తాడెమో.. ఏది ఏమైనప్పటికీ ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ ఇంకా పూర్తి కానేలేదు. మే నెల ప్రవేశించడానికి మరో వారం రోజుల సమయం ఉంది. అయినా.. ఎండలు దంచికొడుతున్నాయి. ఇక రోహిణి కార్తె ప్రవేశిస్తే రోళ్లు పగులుతాయేమోనని అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం సాయంత్రం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. పట్టపగలు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనిస్తున్నాయి. ఆదివారం ఉభయ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదైంది. గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటున్నది. పారిశ్రామిక జిల్లా అయినా భద్రాద్రి జిల్లా ఉడికిపోతుంది.
కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియా సింగరేణి ప్రాంతాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. కూలి పనులకు వెళ్లే కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నది. ఎండలకు తాళలేక ఏజెన్సీలో గిరిజనులు తునికాకు సేకరణ సమయాన్ని తగ్గించుకుంటున్నారు. పట్టణాల్లో వర్తక, వాణిజ్య వ్యాపారాలు గణనీయంగా పడిపోతున్నాయి. మరోవైపు అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అగ్నిమాపకశాఖ అధికారులను అప్రమత్తం చేసి అగ్ని మాపక వాహనాలను సిద్ధంగా ఉంచుతున్నది.
పెరిగిన విద్యుత్ వినియోగం…
ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. గృహ అవసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు రోజుకు సగటున 8.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతున్నది. ఎండలకు తాళలేక పేద, మధ్యతరగతి ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తుండగా సంపన్న వర్గాలు ఏసీలు వినియోగిస్తున్నాయి. గతేడాది కంటే కూలర్లు, ఎయిర్ కండీషన్ల వినియోగం పెరిగిపోవడంతో విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు జంకకుండా విద్యుత్తు వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నది.
వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన చర్యలు..
వడదెబ్బ ఒక మెడికల్ ఎమర్జెన్సీ. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ముందుగా బాధితుడిని నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. బిగుతుగా ఉన్న వస్ర్తాలను వదులు చేయాలి. శరీరానికి గాలి తగిలేలా చూడాలి. వ్యక్తి చుట్టూ గుంపుగా ఉండకూడదు. పరిశుభ్రమైన బట్టను చల్లని నీళ్లలో ముంచి శరీరంపై బాగా అద్దాలి. ఉప్పు కలిపిన చల్లని నీరు, మజ్జిగ, గంజి లేదా గ్లూకోజ్ నీళ్లు తాగించాలి. పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు గుర్తిస్తే అతడు పడుకున్న బెడ్‌పై కాళ్లవైపు ఎత్తైన దిండు అమర్చాలి. శరీరం పైభాగం కంటే పాదాలు ఎత్తుగా ఉండేలా చూడాలి. డాక్టర్ సలహా మేరకు 500 మిల్లీ గ్రాముల పారాసిట్మాల్ మాత్ర ఇవ్వాలి. లేదా 300 మిల్లీ గ్రాముల పారాసిట్మాల్ను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను వేగంగా తగ్గిస్తుంది. కండరాల బాధ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
వడదెబ్బ నివారణ ఇలా..
వాతవరణంలో ఉష్ణోగ్రతలు పెరిగితే శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరం పొడిబారుతుంది. దప్పిక ఎక్కువవుతుంది. నీరసం ఆవహిస్తుంది. తీవ్రత ఎక్కువైతే వాంతులయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్ తలెత్తి శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. ఊపిరితిత్తులు సరిగా పని చేయవు. దీంతో శరీరంలో వేడి పెరిగి వడదెబ్బకు గురవుతాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు వడదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువ. వేసవిలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. తరచుగా పండ్ల రసాలు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోవాలి. సూర్యరశ్మిని గ్రహించే గాఢమైన రంగు దుస్తులు ధరించవద్దు. బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా రుమాలు ధరించాలి. లేదా గొడుగును వెంట తీసుకెళ్లాలి. డీహైడ్రేషన్‌ను అధిగమించడానికి ఓఆర్ఎస్ తాగాలి. శీతల పానియాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.