భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : రైతు పండించిన పంటను కొనుగోలు చేసేందుకే భద్రాద్రి కొత్తగూడెం మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లను తొలిసారిగా ప్రారంభించామని మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, జిల్లా అధికారి ఎంఏ అలీమ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖ మ్మం తరహాలో ఇక్కడా మిర్చి కొనుగోళ్లు జరుగుతాయన్నారు. భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు జిల్లా రైతులు ఇక్కడ విక్రయాలు చేసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతానికి నలుగురు ట్రేడర్స్ ముందుకు వచ్చారన్నారు. మిర్చి క్వాలిటీ ఉంటే ఖమ్మం నుంచి ట్రేడర్స్ వస్తారని అన్నారు. తొలి రోజు జెండా పాట క్వింటా రూ.18 వేలు పలికిందన్నారు. త్వరలో ఈ నామ్ ద్వారా కొనుగోళ్లు చేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక చొరవతో కొనుగోళ్లకు చొరవ చూపడం జరిగిందన్నారు. త్వరలో ఈ నామ్ ద్వారా కొనుగోళ్లు చేస్తామన్నారు. ట్రేడర్స్ కొనుగోలు చేసిన మిర్చి రైతులకు సొమ్ములు చెల్లించిన తర్వాతనే సరుకు ట్రేడర్స్కు ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి అన్ని పంటలకు విక్రయాలు జరిగేలా చూస్తామన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వీరహనుమంతురావు, మార్కెట్ కమిటీ సెక్రటరీ నరేశ్, రైతులు పాల్గొన్నారు.